సూపర్ స్లొవేకియా | Russia 1-2 Slovakia: Euro 2016 – as it happened | Sakshi
Sakshi News home page

సూపర్ స్లొవేకియా

Published Thu, Jun 16 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

సూపర్ స్లొవేకియా

సూపర్ స్లొవేకియా

* రష్యాపై 2-1తో విజయం  
* హామ్‌సిక్ అద్భుత ప్రదర్శన  

* యూరో కప్
లిలీ మెట్రోపోల్ (ఫ్రాన్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా తొలిసారి యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్లొవేకియా జట్టు అదరగొట్టే ఆటతీరుతో అద్భుతం చేసింది. తొలి మ్యాచ్‌లో వేల్స్ జట్టు చేతిలో ఓడినప్పటికీ... రెండో మ్యాచ్‌లోనే తేరుకొని నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది.

రష్యా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో స్లొవేకియా 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. స్లొవేకియా తరపున వీస్ (32వ నిమిషంలో), హామ్‌సిక్ (45వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... రష్యాకు గ్లుషకోవ్ (80వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు.  
 
ఆరంభంలో అంతగా దూకుడు కనబరచని స్లొవేకియా 32వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలచింది. మధ్య భాగంలో నుంచి హామ్‌సిక్ అందించిన లాంగ్‌పాస్‌ను ఎడమవైపున అందుకున్న వీస్ ‘డి’ ఏరియాలో ఇద్దరు రష్యా డిఫెండర్లను ఏమార్చి కుడికాలితో బలమైన షాట్ కొట్టి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు.

ఆ తర్వాత 45వ నిమిషంలో హామ్‌సిక్ ఎడమవైపు నుంచి క్లిష్టమైన కోణం నుంచి కొట్టిన షాట్ నేరుగా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో స్లొవేకియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో రష్యా ఎదురుదాడులు చేసినా... స్లొవేకియా పటిష్టమైన డిఫెన్స్‌తో వారి ఆశలను వమ్ము చేసింది. చివర్లో సబ్‌స్టిట్యూట్ గ్లుషనోవ్ గోల్ చేసినా... రష్యాకు నిరాశే మిగిలింది.
 
పోర్చుగల్‌ను నిలువరించిన ఐస్‌లాండ్
సెయింట్ ఎటెని: క్రిస్టియానో రొనాల్డో, నాని, పెపెలాంటి పలువురు స్టార్ ఆటగాళ్లతో కూడిన పోర్చుగల్ జట్టుకు తొలి మ్యాచ్‌లో ‘డ్రా’ ఎదురైంది. ట్విట్టర్‌లో రొనాల్డోకు ఉన్న ఫాలోవర్స్ (43 లక్షలు)లో పదోవంతు కూడా జనాభా లేని ఐస్‌లాండ్ (3 లక్షల 32 వేలు) జట్టు యూరో అరంగేట్రంలోనే పటిష్టమైన పోర్చుగల్‌ను 1-1తో నిలువరించి అందరి దృష్టిని ఆకర్షించింది. పోర్చుగల్ తరఫున నాని (31వ నిమిషంలో)...

ఐస్‌లాండ్ తరఫున బిర్కిర్ జార్నాసన్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్కోరును సమం చేశాక... ఐస్‌లాండ్ మొండి పట్టుదలతో పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో పోర్చుగల్ మరో గోల్ చేయడంలో విఫలమైంది. ఐస్‌లాండ్ ఆటతీరుపట్ల రొనాల్డో అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్కోరును సమం చేశాక ఐస్‌లాండ్ ఆటగాళ్లు గోల్‌పోస్ట్ ముందు బస్సు అడ్డుపెట్టి ఆడినట్లు వ్యవహరించారని విమర్శించాడు.
 
స్విట్జర్లాండ్, రొమేనియా మ్యాచ్ డ్రా
గ్రూప్ ‘ఎ’లో స్విట్జర్లాండ్, రొమేనియాల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది.   18వ నిమిషంలో రొమేనియాకు లభించిన పెనాల్టీ కిక్‌ను బొగ్దాన్ స్టాన్‌కు గోల్‌గా మలిచాడు. స్విట్జర్లాండ్ తరఫున 57వ నిమిషంలో మెహమెది  గోల్ చేశాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ ఖాతాలో నాలుగు, రొమేనియాకు ఒక పాయింట్ ఉన్నాయి.
 
‘యూరో’లో నేడు ఇంగ్లండ్ X వేల్స్ సా.గం. 6.30 నుంచి
ఉక్రెయిన్ X నార్తర్న్ ఐర్లాండ్ రా.గం. 9.30 నుంచి
జర్మనీ X పోలాండ్ రా.గం. 12.30 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement