కోర్టులో రష్యా స్విమ్మర్లు సవాల్
మాస్కో:రియో ఒలింపిక్స్లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో ఇద్దరు రష్యా స్మిమ్లర్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్)లో అప్పీల్ చేశారు. ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ (ఫినా) తమను తగిన కారణాలు లేకుండా రియో ఒలింపిక్స్ నిషేధం విధించిందని పేర్కొంటూ వ్లాదిమిర్ మొరొజోవ్, నిఖిత లోబింట్సెవ్లు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సీఏఎస్ లో పిటిషన్ దాఖలు చేసినట్లు వారి న్యాయవాది అర్టోమ్ పాత్సేవ్ స్పష్టం చేశారు.
రష్యా స్మిమర్ల జట్టులో భాగంగా రియోకు వెళ్లే వారిలో వ్లాదిమిర్, నిఖితలకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నివేదిక ఆధారంగా వీరిపై నిషేధం విధిస్తూ ఫినా నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేసిన ఆ ఇద్దరు స్విమ్మర్లు .. తమపై నిషేధం అన్యాయమంటూ వారు కోర్టుకు వెళ్లారు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్, తొమ్మిది సార్లు యూరోపియన్ చాంపియన్ అయిన వ్లాదిమిర్.. గత లండన్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల ఫ్రీ స్టయిల్ లో కాంస్య పతకం గెలిచాడు. మరోవైపు లోబింట్సెవ్ 2012 లండన్ ఒలింపిక్స్ లో 4x100 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకోగా, 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 4x200 మీటర్ల ఫ్రీ స్టయిల్ లో రజతం సాధించాడు.
ఈనెల 24వ తేదీన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సమావేశంలో రష్యా కు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుపై పూర్తిగా నిషేధించకుండా క్రీడాకారులు డోపింగ్ రికార్డు ఆధారంగా రియో భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ఐఓసీ సిద్ధమైంది. అయితే ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల వద్ద నుంచి రష్యా అథ్లెట్లు క్లియరెన్స్ తెచ్చుకున్న తరువాతే వారు అర్హత పొందుతారని పేర్కొంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకూ 117 రష్యన్ అథ్లెట్లపై నిషేధం పడింది. వీరిలో 67 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఉండటం గమనార్హం.