శ్రీశాంత్ కు తప్పని తిప్పలు!
కొచ్చి:తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్నిఇటీవల కేరళ హైకోర్టు ఎత్తివేసినా క్రికెటర్ శ్రీశాంత్ కు తిప్పలు తప్పడం లేదు. తాను స్కాట్లాండ్ లీగ్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చే క్రమంలో బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందనా లేదంటూ మరోసారి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు శ్రీశాంత్. ఆ ఎన్ఓసీని స్కాట్లాండ్ క్రికెట్ అధికారులకు ఇవ్వాల్సిన అవసరముందని, ఆ మేరకు బీసీసీఐ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని శ్రీశాంత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్కాట్లాండ్ లీగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసిందని, తనకు తొందరగా ఎన్ఓసీ ఇవ్వకపోతే ఆ లీగ్ లో ఆడే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతానని శ్రీశాంత్ పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంచితే,శ్రీశాంత్ పై జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు ఆగస్టు 7వ తేదీన ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమైంది బీసీసీఐ. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసే యోచనలో బీసీసీఐ ఉంది.ఒకవేళ బీసీసీఐ కోర్టుకు వెళితే మాత్రం స్కాట్లాండ్ లీగ్ కు సంబంధించి శ్రీశాంత్ కు ఎన్ ఓసీ రావడం కష్టమే.