
తిరువనంతపురం: తొలి అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ బౌలర్ల జోరును వర్షం అడ్డుకున్నా... సఫారీని మాత్రం ఆదుకోలేకపోయింది. మూడో రోజు ఆటలో కేవలం 20 ఓవర్ల ఆటే జరిగినా... దక్షిణాఫ్రికా ‘ఎ’ పతనం మాత్రం క్రితం రోజులాగే కొనసాగింది. బుధవారం రెండు సెషన్లను వర్షం తుడిచిపెట్టింది. ఆట చాలా ఆలస్యంగా ఆఖరి సెషన్‌లో ఆరంభమైంది. ఓవర్‌నైట్ స్కోరు 125/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి 55 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సఫారీ జట్టు గత స్కోరుకు కేవలం 54 పరుగులు జోడించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ క్లాసెన్ (48; 5 ఫోర్లు), ముల్డర్ (46; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు కుదురుగా ఆడారు. కానీ ఆఫ్‌స్పిన్నర్ జలజ్ సక్సేనా ఈ జోడీని విడగొట్టడంతో సఫారీ కష్టాలు మొదటికొచ్చాయి. ఆట నిలిచే సమయానికి సిపమ్లా (5 బ్యాటింగ్), ఇన్‌గిడి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. భారత్ ‘ఎ’ కంటే సఫారీ జట్టు కేవలం 40 పరుగుల స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. ఆఖరి వికెట్‌ను తీసి... నిర్దేశించే కొద్దిపాటి లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టుకు తొలి సెషన్ సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment