మార్క్‌రమ్
మైసూర్: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు శుభ సూచకం. ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్, దక్షిణాఫ్రికా ‘ఎ’ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ (253 బంతుల్లో 161; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకంతో ఫామ్ చాటుకున్నాడు.అతడికి తోడు ఆల్ రౌండర్ పీటర్ ముల్డర్ (230 బంతుల్లో 131 నాటౌట్; 17 ఫోర్లు, సిక్స్) శతకం బాదడంతో భారత్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ‘ఎ’కు 17 పరుగుల ఆధిక్యం దక్కింది.
ఓవర్‌నైట్ స్కోరు 159/5తో మూడో రోజు గురువారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ను మార్క్‌రమ్, ముల్డర్ చక్కటి బ్యాటింగ్‌తో ముందుకు నడిపించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న వీరు ఆరో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆ తర్వాత ముల్డర్‌కు ఫిలాండర్ (21) సహకారం అందించాడు. ఈ దశలో కుల్దీప్ యాదవ్ (4/121), షాబాజ్ నదీం (3/76) చివరి మూడు వికెట్లను ఐదు పరుగుల తేడాతో పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ ‘ఎ’ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (9) క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌కు శుక్రవారం చివరి రోజు.
Comments
Please login to add a commentAdd a comment