
యూట్యూబ్‌లో సచిన్ సంచలనం
మైదానంలోకి అతడు అడుగు పెడుతున్నాడంటే చాలు.. స్టేడియంలో ఉన్న జనాలంతా ఒక్కసారిగా లేచి ఓ... అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అతడు సెంచరీకి చేరువ అయ్యాడంటే అంతా కలిసి ’సాచిన్.. సాచిన్’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తారు. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ మైదానంలోనే కాదు.. వెండితెర మీద కూడా సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. బయోపిక్‌లు తీయడంలో అందెవేసిన చేయి అయిన ప్రముఖ దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ’సచిన్.. ఎ బిలియన్ డ్రీమ్స్‘ సినిమా ట్రైలర్ గురువారం రాత్రి విడుదలైంది. అప్పుడే యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. దాదాపు 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూలు ఆ ట్రైలర్‌కు వచ్చాయి.
అన్నతో కలిసి చిన్నతనంలో పార్కింగ్ చేసి ఉంచిన కారు టైరులోని గాలి తీసేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 2 నిమిషాల 13 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో తొలిసారి బ్యాట్ పట్టుకున్నప్పటి మధుర స్మృతులు, టీమిండియా మొదటిసారి ప్రపంచకప్ గెలిచినప్పటి సంబరాలు, బ్లాక్ అండ్ వైట్ టీవీలో తాను చూసిన మ్యాచ్‌లు, రమాకాంత్ ఆచ్రేకర్ శిష్యరికంలో నేర్చుకున్న పాఠాలు.. ఒకానొక సమయంలో తన ఇంటి మీద పడిన రాళ్లు, దిష్టిబొమ్మలు తగలబెట్టిన నిరసనలు, తీవ్రంగా మధనపడి.. మళ్లీ మైదానంలో మెరిసిన క్షణాలు, కోట‍్లాదిమంది అభిమానులు తమ గుండెల్లో గుడికట్టి పూజించిన వైనం.. పదో నెంబరు జెర్సీ.. ఇలా అన్ని విషయాలూ కనిపిస్తాయి. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుంది. రవి భగ్చాంద్కా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలైతే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి. ఇంతకుముందు ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోనీ నేరుగా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా కనిపించడంతో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
The stage is set and we are ready to begin… #SachinTrailer is out now. Here it is! https://t.co/T3oWyZw3DL
— sachin tendulkar (@sachin_rt) 13 April 2017