దేశీయ క్రికెట్ కు సచిన్ ఘనంగా గుడ్ బై
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనదైన శైలిలో దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. సచిన్ రాణించి 79 పరుగులతో నాటౌట్ నిలువడంతో ముంబై జట్టు హర్యానాపై నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దేశవాళీ క్రికెట్ లో సచిన్ కు చిట్టచివరి మ్యాచ్ కావడంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి లాహ్లీ మ్యాచ్ పై నిలిచింది.
నాలుగవ రోజు ఆటలో విజయానికి 39 పరుగులు కావాల్సి ఉండగా, సచిన్ 55 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించారు. సచిన్ కు తోడుగా ఉన్న ధావల్ కులకర్ణి.. మోహిత్ శర్మ బంతిని బౌండరీకి తరలించడంతో విజయం ముంబై పక్షాన నిలచింది. దాంతో సచిన్ క్రికెట్ కెరీర్ లో చివరి మ్యాచ్ కావడంతో ముంబై జట్టు మాస్టర్ కు బహుమతిగా ఇవ్వాలనే కోరిక సాకారమైంది. చివరి మ్యాచ్ లో సచిన్ 79 పరుగులతో నాటౌట్ గా నిలువడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.