ఒక్క బాల్ ఆడకపోయినా.. సచిన్ పరుగుల సునామీ
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. 2003 జరిగిన ప్రపంచ కప్ లో సచిన్ సృష్టించిన బ్యాటింగ్ సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ ప్రపంచ కప్ లో వ్యక్తిగతంగా 673 పరుగులు చేయడం అప్పట్లో ఓ రికార్డుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఆ ప్రపంచ కప్ లో నెట్ ప్రాక్టీస్ లో ఒక్క బంతిని కూడా ఆడకపోయినా.. ఆరవీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్స్ వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ ల బంతులను సునాయాసంగా బౌండరీకి తరలించారని ద్రావిడ్ తెలిపారు. కీలక టోర్నమెంట్ లో రాణించాలని తామందరం నెట్స్ ప్రాక్టీస్ లో చెమటోడ్చినా.. సచిన్ మాత్రం ప్రాక్టీస్ కు దూరంగా ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ద్రావిడ్ తెలిపాడు.
అయితే ఎందుకు నెట్ ప్రాక్టీస్ చేయడం లేదని తాము అడుగగా.. నేను బాగానే ఆడుతా అనే నమ్మకం ఉంది. ప్రాక్టీస్ చేయడం అనవసరం అనిపిస్తోంది. పరుగులు ఎప్పుడైనా సాధించగల నమ్మకం నాలో ఉంది అని సచిన్ అన్నాడని ద్రావిడ్ తెలిపారు. ప్రపంచంలో గొప్ప ఆటగాడైనా సచిన్ ఆట చూసే భాగ్యం తమకు కలిగిందనే ఫీలింగ్ అందరిలోనూ కలిగిందని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.