జూనియర్లకు సచిన్ న్యూ ఇయర్ సందేశం
ముంబై: ట్వంటీ 20 తరహాలో ప్రతీ బంతిని బలంగా కొట్టాలని భావించకండి. అది మన ప్రతిభకు వెలుగులోకి రానివ్వదు. ప్రత్యేకంగా కాపీ బుక్ క్రికెట్, గేమ్ బేసిక్స్ ను కచ్చితంగా ఫాలో కావాలి. అలా ఆడినప్పుడే మీలో ఆట బయటకొస్తుంది' అని జూనియర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దిశా నిర్దేశం చేశాడు. నూతన సంవత్సరం సందర్భంగా ముంబై అండర్-16 క్రికెటర్లతో సచిన్ ముచ్చటించాడు. ఆ స్క్వాడ్ లో ఉన్న సచిన్ కుమారుడు అర్జున్ కూడా తండ్రి సలహాలను ఆసక్తిగా ఆలకించాడు. సచిన్ ఒక మెంటర్ మాదిరి కాకుండా వారితో ఒక స్నేహితుడిలా కలిసిపోయి సలహాలిచ్చాడు.
సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడటాన్ని జూనియర్ల స్థాయిలో నేర్చుకోవాలని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆ తరహా ఆటే జట్టుకు విజయాలను అందిస్తున్న విషయం గుర్తించాలన్నాడు. అయితే ఫ్లాషీ స్ట్రోక్స్(దిల్ స్కూప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్) ఆట జూనియర్ స్థాయిలో చాలా ప్రమాదకరమని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా ఆటను నేర్చుకునే స్థాయిలో ఉన్న వారు బేసిక్ క్రికెట్ నే అనుసరించాలని తెలిపాడు.