కౌలాలంపూర్: కొత్త ఏడాది ఆరంభ టోర్నీ మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్... మహిళల డబుల్స్ కేటగిరీలో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ రెండో రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఏడో సీడ్ సైనా (భారత్) 21–14, 21–16తో పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)పై వరుస గేముల్లో కేవలం 39 నిమిషాల్లోనే గెలుపొందింది.
నేడు జరిగే క్వార్టర్స్‌లో 2017 ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా తలపడుతుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా ముఖాముఖీ రికార్డులో 8–4తో ఒకుహారా (వరల్డ్ నెం.2)పై ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఏడో సీడ్ శ్రీకాంత్ (భారత్) 23–21, 8–21, 21–18తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై పోరాడి గెలిచాడు. నేటి మ్యాచ్‌లో నాలుగో సీడ్ సన్‌వాన్‌హో (కొరియా)తో శ్రీకాంత్ తలపడతాడు. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ కశ్యప్ 17–21, 23–25తో ఆరోసీడ్ ఆంథోని సినిసుకా జింటింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల డబుల్స్ రెండోరౌండ్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 18–21, 17–21తో ని కెటుట్ మహాదేవి ఇస్తారాణి– రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment