క్వార్టర్స్‌లో సైనా, సింధు | SAINA NEHWAL and sindhu entered in quarters finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనా, సింధు

Published Fri, Apr 24 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

క్వార్టర్స్‌లో సైనా, సింధు

క్వార్టర్స్‌లో సైనా, సింధు

కశ్యప్‌కు చుక్కెదురు
 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
 వుహాన్ (చైనా): ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, యువ సంచలనం పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. గురువారం వుహాన్ స్పోర్ట్స్ సెంటర్ జిమ్నాజియంలో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరాపై 21-14, 10-21, 21-10 తేడాతో సైనా నెహ్వాల్ నెగ్గింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో తను ఐదో సీడ్ జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ)ని ఎదుర్కొంటుంది.
 
 అటు ఎనిమిదో సీడ్ సింధు కేవలం 20 నిమిషాల్లోనే టెంగ్ ఇవోక్ యును 21-8, 21-9 తేడాతో సునాయాసంగా ఓడించింది. అయితే క్వార్టర్స్‌లో మాత్రం తనకు గట్టి పోటీనే ఎదురుకానుంది. టాప్ సీడ్ లి జురుయ్ (చైనా)తో సింధు ఆడాల్సి ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హైదరాబాదీ ఆటగాడు పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో తను ఏడో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో 23-21, 17-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.
 
  పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి 10-21, 13-21 తేడాతో షియావోలాంగ్ లియు, జిహాన్ క్వి (చైనా) జంట చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ 13-21, 5-21 తేడాతో కాయ్‌లు, హువాంగ్ (చైనా) చేతిలో చిత్తయ్యారు.
 తొలి రౌండ్‌లో బై లభించడంతో పాటు రెండో రౌండ్‌లో వాకోవర్‌తో నేరుగా ప్రిక్వార్టర్స్‌కు చేరిన  సైనాకు ప్రత్యర్థి ఒకుహరా నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌లో 3-5తో వెనుకబడిన సైనా వరుసగా ఆరు పాయింట్లు సాధించి 9-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఒకుహరా కూడా వరుసగా నాలుగు పాయింట్లు సాధించినా ఆ తర్వాత సైనా జోరు ముందు నిలువలేకపోయింది.
 
  కానీ రెండో గేమ్‌లో మాత్రం ఒకుహరా తన వ్యూహాలను మార్చింది. దీంతో నేరుగా 5-0తో ఆధిక్యం సాధించడంతో పాటు సైనాకు అందకుండా దూసుకెళ్లి 21-10తో గేమ్‌ను నెగ్గి పోటీలో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం సైనా నిలకడైన ఆటతీరుతో పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. 4-6తో వెనుకబడిన దశ నుంచి 11-7తో ముందుకెళ్లింది.  ఆ తర్వాత సైనా దూకుడును ఒకుహరా అడ్డుకోలేకపోయింది. దీంతో తొమ్మిది వరుస పాయింట్లతో సైనా గేమ్‌ను ముగించింది.
 
 మరోవైపు సింధుకు ప్రత్యర్థి నుంచి కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. తొలి గేమ్‌లోనైతే వరుసగా పది పాయింట్లతో టెంగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే జోరుతో రెండో గేమ్‌లోనూ ఆడి క్వార్టర్స్‌కు చేరింది. గత మ్యాచ్‌లో సుదీర్ఘ పోరులో తలపడిన కశ్యప్ ఆటతీరు ప్రిక్వార్టర్స్‌లో గతి తప్పింది. తొలి గేమ్ లో 0-5తో వెనుకబడినా 11-8తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే వాంగ్ స్కోరును 12-12తో సమం చేశాడు. జాగ్రత్తగా ఆడి  గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. కానీ అలసటతో కనిపించిన కశ్యప్ తర్వాతి రెండు గేమ్‌ల్లో ఓడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement