అందరూ ముందుకు | Saina Nehwal, Kidambi Srikanth into the quarter finals | Sakshi
Sakshi News home page

అందరూ ముందుకు

Published Fri, Oct 26 2018 5:13 AM | Last Updated on Fri, Oct 26 2018 5:13 AM

Saina Nehwal, Kidambi Srikanth into the quarter finals - Sakshi

పీవీ సింధు

పారిస్‌: భారత స్టార్‌ షట్లర్లంతా ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌ చేరారు. అయితే మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీషా రామ్‌ జోడీకి ప్రి క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. గురు వారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ సింధు 21–17, 21–16తో సయాక సాటో (జపాన్‌)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 12–21, 21–16, 21–18తో లీ డాంగ్‌ కిన్‌ (కొరియా)పై చెమటోడ్చి నెగ్గాడు.

గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో మొదటి గేమ్‌ను కోల్పోయిన భారత ఆటగాడు తర్వాత పుంజుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో సైనా కూడా శ్రీకాంత్‌లాగే తొలి గేమ్‌లో వెనుకబడినప్పటికీ తర్వాత రెండు గేముల్లోను ప్రత్యర్థిని చిత్తు చేసింది. డెన్మార్క్‌ ఓపెన్‌ రన్నరప్‌ అయిన సైనా 10–21, 21–14, 21–17తో మాజీ ప్రపంచ చాంపియన్, ఎనిమిదో సీడ్‌ నొజోమి ఒకుçహార (జపాన్‌)పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–13, 21–19తో హి జితింగ్‌–తన్‌ కియాంగ్‌ (చైనా) జంటపై నెగ్గింది.

మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీష జోడి 15–21, 13–21తో నాలుగో సీడ్‌ గ్రేసియా పొలి–అప్రియని రహయు (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మరో వైపు ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ సింధు మళ్లీ రెండో ర్యాంకుకు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) విడుదల చేసిన తాజా మహిళల సింగిల్స్‌ ర్యాంకుల్లో ఆమె ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్‌–2లో కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారిగా ఆమె రెండో ర్యాంకులోకి వచ్చినా ఆ స్థానంలో పదిలంగా కొనసాగలేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement