సైనాపై సింధు పైచేయి | Saina Nehwal is not a special player that have to beat every time: PV Sindhu | Sakshi
Sakshi News home page

సైనాపై సింధు పైచేయి

Published Sat, Apr 1 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

సైనాపై సింధు పైచేయి

సైనాపై సింధు పైచేయి

వరుస గేముల్లో అద్భుత విజయం
ఆద్యంతం హోరాహోరీ పోరు
సమీర్‌ వర్మ పరాజయం
ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ


పాయింట్‌ పాయింట్‌కూ పోరాటం... ఒకసారి డ్రాప్‌ షాట్‌లు కొడితే... మరోసారి స్మాష్‌లు... ఆద్యంతం ఆధిపత్యం కోసం పోటాపోటీ... వెరసి భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరు అందర్నీ అలరించింది. చివరకు... ఏడాది కాలంగా అద్భుతమైన ఫిట్‌నెస్‌ తోపాటు ఫామ్‌లో ఉన్న సింధు పైచేయి సాధించింది. అంతర్జాతీయ స్థాయి టోర్నీలో సైనాపై సింధుకిదే తొలి విజయం. ఈ గెలుపుతో 2014 సయ్యద్‌ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ ఫైనల్లో సైనా చేతిలో
ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకున్నట్టయింది.  


న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఊరిస్తోన్న ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను సాధించే దిశగా భారత స్టార్‌ పీవీ సింధు ఒక అడుగు ముందుకేసింది. భారత్‌కే చెందిన మరో స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌పై వరుస గేముల్లో నెగ్గిన సింధు ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 47 నిమిషాల్లో 21–16, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సైనా నెహ్వాల్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో రెండో సీడ్‌ సుంగ్‌ జీ హున్‌ (కొరియా)తో సింధు తలపడుతుంది.

సుంగ్‌ జీ హున్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6–4తో ఆధిక్యంలో ఉంది. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) 21–10, 20–22, 21–14తో మినత్సు మితాని (జపాన్‌)పై, సుంగ్‌ జీ హున్‌ 21–16, 22–20తో ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై, అకానె యామగుచి (జపాన్‌) 21–13, 11–21, 21–18తో నోజోమి ఒకుహారా (జపాన్‌)పై గెలిచారు. రెండో సెమీఫైనల్లో అకానె యామగుచితో కరోలినా మారిన్‌ ఆడుతుంది.

ఇండియా ఓపెన్‌లో ఆరోసారి ఆడుతున్న సింధు 2013లో ఏకైకసారి సెమీఫైనల్‌కు చేరింది. గత ఏడాది నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న సింధు అంచనాలకు తగ్గట్టు రాణించగా... ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను సంతరించుకుంటున్న సైనా కూడా కొన్నిసార్లు మెరిపించింది. అయితే కీలకదశలో తడబాటుకు లోనుకాకుండా ఆడిన సింధు పైచేయి సాధించింది. మ్యాచ్‌ మొత్తంలో సింధు, సైనాలు కొన్నిసార్లు ఆడిన స్మాష్‌ షాట్‌లు హైలైట్‌గా నిలిచాయి. తొలి గేమ్‌ ఆరంభంలో స్కోరు 9–9తో సమంగా ఉన్నదశలో సింధు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 15–9తో ముందంజ వేసింది.

ఆ తర్వాత అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సైనా ఆధిపత్యం చలాయించినా... చివర్లో ఒత్తిడికి లోనైంది. సింధు 16–19తో వెనుకబడిన దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–19తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కో పాయింట్‌ గెలిచి 20–20తో సమఉజ్జీగా నిలిచారు. ఈ దశలో సింధు వరుసగా రెండు కళ్లు చెదిరే షాట్‌లతో రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.

ముగిసిన సమీర్‌ పోరు...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక క్రీడాకారుడు సమీర్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు. ఆండెర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ 22–24, 19–21తో పోరాడి ఓటమి చవిచూశాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ హు యున్‌ (హాంకాంగ్‌)పై సంచలన విజయాలు సాధించిన సమీర్‌ ఈసారి మాత్రం కీలకదశలో పొరపాట్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement