
ప్రపంచకప్‌లో భారత యువ జట్టు తొలి మ్యాచ్ నుంచి చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరి మెట్టుపై అనూహ్యంగా తలవంచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రతీ యువ క్రికెటర్ తన కలను నెరవేర్చుకున్నాడు. వారిలో హైదరాబాద్‌కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ కూడా ఒకడు. గత రెండేళ్లుగా భారత అండర్–19 టీమ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన అతను తాజా వరల్డ్ కప్ జట్టు సభ్యుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తుది పోరు అనంతరం బుధవారం స్వస్థలం చేరుకున్న అతను తన అనుభవాన్ని ‘సాక్షి’తో పంచుకున్నాడు.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ కప్‌ను గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్న తమ జట్టు త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోవడం నిరాశ కలిగించిందని భారత అండర్–19 జట్టు బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ అన్నాడు. ఈ టోర్నీలో టీమిండియా యువ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ భాగంగా ఉన్నాడు. బంగ్లాదేశ్‌పై చివరి వరకూ గెలవగలమని నమ్మామని... అయితే చివరకు అది సాధ్యం కాలేదంటూ తిలక్ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...
ఫైనల్లో పరాజయంపై...
మ్యాచ్‌కు ముందు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఎప్పుడు కూడా బంగ్లా చేతిలో ఓడిపోతామనే ఆలోచనే రాలేదు. అయితే అనూహ్య ఫలితం వచ్చింది. నిరాశపడటం సహజమే. అయితే మా కోచ్ అభయ్ శర్మ తన మాటలతో మాలో మళ్లీ స్ఫూర్తి నింపారు. ఓడిపోవడంలో తప్పు లేదని, అద్దంలో మనల్ని మనం చూసుకొని ఎలాంటి ప్రదర్శన ఇచ్చామో నిజాయితీగా తెలుసుకుంటే చాలని చెప్పారు. ఆ రకంగా చూస్తే మా ఆట ఎంతో సంతృప్తినిచ్చింది. ద్రవిడ్ సర్ కూడా ప్రతీ మ్యాచ్‌కు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాతో సంభాషించేవారు.
ఫైనల్ సాగిన తీరుపై...
మ్యాచ్ ముందు రోజు కురిసిన వర్షం కారణంగా పిచ్‌పై తేమ ఉండిపోయింది. మేం ముందుగా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. అయితే పిచ్‌తో మేం ఇబ్బంది పడలేదు. నేను, యశస్వి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాం. నేను అవుటైన తర్వాత జట్టు బ్యాటింగ్ తడబడింది. అయినా సరే 220–230 పరుగులు చేయగలమని భావించాం. కానీ అంతకంటే చాలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాం. మా బౌలింగ్‌పై నమ్మకముంది కాబట్టి కాపాడుకోగలమనిపించింది. 150 పరుగులు చేసినా గెలవగలమని భావించాం. ఆసియా కప్‌లో 105 పరుగులు చేసి కూడా ఇదే బంగ్లాపై గెలిచాం కాబట్టి నమ్మకముంది. నిజంగానే మా బౌలర్లు బాగా కట్టడి చేశారు. అయితే ఒక్క కెప్టెన్ ఇన్నింగ్ ఫలితాన్ని మార్చింది.
టాస్ కీలకంగా మారిందా...
అలా ఏమీ లేదు. రాహుల్ ద్రవిడ్ సర్ శిక్షణలో మేం అన్ని రకాల కాలమాన పరిస్థితుల్లో ఆడేందుకు సన్నద్ధమయ్యాం. పిచ్ ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా, ప్రత్యర్థి ఎలా ఉన్నా సమస్య లేదు. గత రెండేళ్లుగా ఇంతకంటే కఠినమైన, విభిన్నమైన పరిస్థితుల్లో మ్యాచ్‌లు గెలిచాం. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేయడం సమస్య కాదు. ఆ రోజు మాకు కలిసి రాలేదు.
ఫైనల్ తర్వాత జరిగిన ఘటనలపై...
నిజానికి ఇందులో భారత ఆటగాళ్ల తప్పేమీ లేదు. బంగ్లా కుర్రాళ్లే తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో నిలవలేకపోయారు. వారే దూషణలకు దిగారు. దాంతో మా ఆటగాళ్లు ఒకరిద్దరు వారిని నిరోధించేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది. దాదాపు పది నిమిషాల పాటు కాస్త ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అయితే ఆ తర్వాత అంతా మామూలుగా మారిపోయింది. సారీలు చెప్పుకొని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఆటగాళ్లకంటే బంగ్లా అభిమానుల వల్లే సమస్య వచ్చింది. ఫైనల్‌కు వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారితో పోలిస్తే భారత అభిమానులు కొద్ది మందే. దాంతో రెచ్చగొట్టి సమస్యగా మార్చారు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై...
ఆ జట్టుతో పోలిస్తే మా జట్టు బాగా బలంగా ఉందని తెలుసు కాబట్టి దానిని మరో మ్యాచ్‌గానే చూశాం తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక ఆటగాళ్లతో దూరం పాటించడం, గంభీరంగా ఉండటం కూడా బయట రాసినంత ఎక్కువగా ఏమీ లేదు. అదేమీ తెచ్చి పెట్టుకున్నది కూడా లేదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది.
వరల్డ్ కప్‌లో వ్యక్తిగత ప్రదర్శనపై...
ఆరు మ్యాచ్‌లలో మూడు ఇన్నింగ్స్‌లలోనే బ్యాటింగ్ అవకాశం వచ్చింది. మిగతా మూడు మ్యాచ్‌లు ఓపెనర్లే కొట్టేశారు. బ్యాటింగ్ ఎక్కువగా రాకపోవడం కొంత నిరాశ కలిగించినా... జట్టు విజయమే అన్నింటికంటే ముఖ్యం కాబట్టి దాని గురించి ఆలోచన అనవసరం. ఆస్ట్రేలియాతో విఫలమైనా శ్రీలంక, ఫైనల్లో బంగ్లాపై బాగా ఆడాను. ఫైనల్ ఇన్నింగ్స్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఆడాను. సెంచరీ చేస్తానని అనిపించింది. కానీ అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాను. వరల్డ్ కప్‌కు ముందు నాలుగు జట్ల టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడంతో పాటు 9 ఇన్నింగ్స్‌లలో 6 అర్ధ సెంచరీలు చేయడం ద్వారా మంచి ఫామ్‌తో నేను టోర్నీకి వచ్చాను. దక్షిణాఫ్రికా బయల్దేరే ముందు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ సర్, నా వ్యక్తిగత కోచ్ సాలమ్ బయాష్ ఇచ్చిన అమూల్య సూచనలు ఎంతో పనికొచ్చాయి.
టోర్నీలో మరచిపోలేని క్షణం...
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో ఇక ఓడిపోతామేమో అనిపించింది. తీవ్ర ఉత్కంఠను అనుభవించిన క్షణం అది. అయితే చివరకు గెలుపు అందుకోవడం అందరికీ ఎంతో సంతృప్తినిచ్చింది. మైదానం బయట మేం క్రూగర్స్ పార్క్ సహా చాలా చోట్ల విహరించాం. అన్నింటికంటే బంగారం తయారీని చూడటం ఒక చక్కటి జ్ఞాపకం.
రాబోయే టోర్నీలపై...
మున్ముందు ఇప్పట్లో అండర్–19 ఈవెంట్‌లు ఏవీ లేవు కాబట్టి ఇక దృష్టి అంతా సీనియర్ క్రికెటర్‌గా ఎదగడంపైనే పెడతాను. ప్రాక్టీస్‌తో పాటు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తా. రంజీ సీజన్ కూడా ఇప్పుడు ముగిసిపోయింది. ఐపీఎల్‌కు ఎంపిక కాకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఒకటి రెండు జట్ల ట్రయల్స్‌కు వెళ్లాను కూడా. కానీ అవకాశం దక్కలేదు. అయితే ఇకపై మరింత కష్టపడి సీనియర్ స్థాయిలోనూ రాణించడమే నా లక్ష్యం.
బుధవారం దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ చేరుకున్నాక కోచ్ సాలమ్ బయాష్‌తో తిలక్ వర్మ
Comments
Please login to add a commentAdd a comment