జూలైలో సానియా జీవిత చరిత్ర
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవిత చరిత్ర పుస్తకం జూలైలో మార్కెట్‌లోకి రానుంది. ‘ఏస్ ఎగెనెస్ట్ ఆడ్స్’ పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ ప్రచురించింది. ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి.... ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ క్రీడాకారిణిగా ఎదిగిన వైనాన్ని సానియా ఇందులో వివరించింది. తన తండ్రి ఇమ్రాన్ మీర్జాతో కలిసి టెన్నిస్ ప్లేయర్ ఈ పుస్తకాన్ని రాసింది. జీవితంలో తాను సాధించిన విజయాలు, స్ఫూర్తిదాయక సంఘటనలు, ఆటగాళ్లతో కోర్టు బయట జరిగిన విషయాలను ఇందులో పొందుపర్చనుంది. ఈ పుస్తకం కోసం సానియాతో కలిసి పనిచేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని హార్పర్ కొలిన్స్ చీఫ్ ఎడిటర్ వీకే కార్తీకా అన్నారు.
16 ఏళ్ల వయసులో వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా ఆ తర్వాత భారత టెన్నిస్ నంబర్‌వన్ క్రీడాకారిణిగా ఎదిగింది. ‘వచ్చే తరం టెన్నిస్ ప్లేయర్లకు ఈ పుస్తకం ఓ రోడ్‌మ్యాప్‌లాగా ఉపయోగపడుతుందని భావి స్తున్నా. నా స్ఫూర్తితో భవిష్యత్‌లో ఒక్కరైనా గ్రాండ్‌స్లామ్ గెలిస్తే చాలు’ అని సానియా పేర్కొంది.