
మరో టైటిల్ దిశగా...
♦ బ్రిస్బేన్ ఓపెన్ ఫైనల్లో
♦ సానియా జంట
బ్రిస్బేన్: కొత్త ఏడాది, కొత్త సీజన్‌లోనూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన జోరును కొనసాగిస్తోంది. తనకెంతో కలిసొచ్చిన స్విట్జర్లాండ్ భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి సానియా మీర్జా బ్రిస్బేన్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 7-5తో ఆండ్రియా క్లెపెక్ (స్లొవేకియా)-అలా కుద్రయెత్సెవా (రష్యా) జోడీపై విజయం సాధించింది.
సానియా-హింగిస్ జంటకిది వరుసగా 25వ విజయం కావడం విశేషం. చివరిసారి ఈ ఇండో-స్విస్ జోడీకి గతేడాది ఆగస్టులో సిన్సినాటి ఓపెన్ సెమీఫైనల్లో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి ఎదురైంది. శనివారం జరిగే ఫైనల్లో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ)లతో సానియా-హింగిస్ తలపడతారు. 2012లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జంట వరుసగా 25 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ తర్వాత సానియా-హింగిస్ జోడీయే ఈ ఘనత సాధించింది.