
ఆట అంటే ఇష్టమొచ్చినట్లు తిట్టుకోవడమా? జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడమా?
న్యూఢిల్లీ : క్రికెట్ మైదానంలో స్టంప్ మైక్స్ అవసరమా? అని టీమిండియా సీనియర్ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ప్రశ్నించాడు. ఈ స్టంప్ మైక్స్ వల్ల చిన్నచిన్న వివాదాలు పెను దుమారంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డాడు. ఈ స్టంప్స్ విషయంలో ఐసీసీ ఒకసారి పునరాలోచించుకోవాలని ట్వీట్ చేశాడు.
‘మొన్న సర్ఫరాజ్.. నిన్న షానన్ గాబ్రియల్‌లు స్టంప్ మైక్స్ వల్ల ఇబ్బందుల్లో పడ్డారు. ఈ స్టంప్స్ మైక్స్ వాడకం ఆటకు మంచి చేస్తుందా? లేదా అనే విషయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి?’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్‌పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘స్టంప్స్ మైక్స్.. కెమెరాలు లేకుంటే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ చేసిన తప్పులు దొరికేవా?’ అని మంజ్రేకర్‌ను నిలదీస్తున్నారు. ‘ఆట అంటే ఇష్టమొచ్చినట్లు తిట్టుకోవడమా? జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడమా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఉన్నా ఆటగాళ్లు హద్దులు దాటుతున్నారని, వీటిని తీసేస్తే వారి నోళ్లకు అడ్డు అదుపులేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. మరికొందరూ.. క్రికెట్ మైదానంలో ఇవన్నీ అక్కర్లేదని, మైదానంలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం సహజమని అభిప్రాయపడుతున్నారు. ఈ మైక్స్ వల్ల చిన్నిచిన్న వివాదాలు కూడా పెద్దగా మారి ఆటపై ప్రభావం చూపుతున్నాయని కామెంట్ చేస్తున్నారు.
After Sarfraz it’s Shannon Gabriel now who could be in trouble thanks to the stump mics. #ICC must brainstorm and decide if increased use of stump mics is actually good for the game or not.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 12, 2019
ఇక స్టంప్స్ మైక్స్‌తో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ హాట్ టాపిక్ అయ్యాడు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ టీమ్ పెయిన్‌తో మైదానంలో జరిగిన శృతి మించని మాటల యుద్దం ప్రేక్షకులకు కావాల్సిన మజానిచ్చింది. అయితే ఇవే మైక్స్ పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను చిక్కుల్లో పడేసాయి. తీవ్ర అసహనంతో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ పెహ్లువాకియాను ఉద్దేశించి చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వాస్తవానికి సర్ఫరాజ్ పెహ్లువాకియాకు అర్థం కాని ఉర్థూలో మాట్లాడినప్పటికి అది స్టంప్ మైక్స్‌లో స్పష్టంగా రికార్డవ్వడంతో రచ్చరచ్చైంది. సర్ఫరాజ్ తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ క్షమాపణలు కోరినా అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడింది.
తాజాగా వెస్టిండీస్ ఆటగాడు షానన్ గాబ్రియల్ కూడా ఈ తరహా వివాదంలోనే చిక్కుకున్నాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ మూడో టెస్టులో భాగంగా జో రూట్- గాబ్రియల్ మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. అయితే గాబ్రియల్ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్ ‘గే’ అయితే తప్పేంటని ఇచ్చిన సమాధానం మాత్రం రికార్డు అయ్యింది. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో స్టంప్ మైక్స్ వాడకం చర్చనీయాంశమైంది.