గత ఏడు సీజన్లలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా... ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీ గెలవలేకపోయిన సౌరాష్ట్ర ఎట్టకేలకు విజయబావుటా ఎగరేసింది. జైదేవ్ ఉనాద్కట్ నాయకత్వంలో తొలిసారి విజేతగా అవతరించింది. సొంత మైదానంలో హోరాహోరీగా సాగిన తుది పోరులో బెంగాల్‌పై సాధించిన 44 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సౌరాష్ట్రను చాంపియన్‌ను చేసింది. చివరి రోజు నాలుగు వికెట్లతో ఆధిక్యం కోసం బెంగాల్ పోరాడినా లాభం లేకపోయింది. చివరకు రంజీ చరిత్రలో ఎక్కువ సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది.
రాజ్‌కోట్: భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. జైదేవ్ ఉనాద్కట్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు మొదటిసారి విజేతగా నిలిచింది. సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం ‘డ్రా’గా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సౌరాష్ట్రకు ట్రోఫీ ఖరారైంది. చివరి రోజు 72 పరుగులు చేస్తే ఆధిక్యం అందుకునే స్థితిలో ఆట కొనసాగించిన బెంగాల్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 44 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. అయితే విజేత ఖరారైన నేపథ్యంలో ముందుగానే ఆటను నిలిపివేసేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఆ వెంటనే సొంత గడ్డపై సౌరాష్ట్ర సంబరాలు మొదలయ్యాయి. విజేత సౌరాష్ట్రకు రూ. 2 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది.
ఉనాద్కట్ జోరు...
సీజన్ మొత్తం తన అద్భుత బౌలింగ్, కెప్టెన్సీతో సౌరాష్ట్రను నడిపించిన ఉనాద్కట్ చివరి రోజు కూడా కీలక పాత్ర పోషించాడు. ఓవర్‌నైట్ స్కోరు 354/6తో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు అనుస్తుప్ మజుందార్ (151 బంతుల్లో 63; 8 ఫోర్లు)పైనే తమ ఆశలు పెట్టుకుంది. అయితే ఆరో ఓవర్లోనే ఆ జట్టుకు దెబ్బ పడింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో అనుస్తుప్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అదే ఓవర్లో మరో రెండు బంతులకే ఆకాశ్ దీప్ (0) రనౌటయ్యాడు. సింగిల్ తీసేందుకు అవకాశం లేకపోయినా షాట్ ఆడిన ఆకాశ్ ముందుకు వచ్చాడు. కీపర్ బారోత్ విసిరిన బంతి స్టంప్స్‌ను తాకలేదు. అయితే చురుగ్గా వ్యవహరించిన ఉనాద్కట్ వెంటనే దాన్ని అందుకొని వికెట్లపైకి విసిరాడు. అప్పటికీ క్రీజ్‌లో వెనక్కి రాని ఆకాశ్ వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ (5)ను ధర్మేంద్ర జడేజా పెవిలియన్‌కు పంపగా... కొద్ది సేపటికే ఇషాన్ పొరెల్ (1)ను అవుట్ చేసి ఉనాద్కట్ బెంగాల్ ఆట ముగించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర తరఫున అవి బారోత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్విక్ దేశాయ్ (21), విశ్వరాజ్ జడేజా (17), అర్పిత్ వసవాద (3) వికెట్లు తీయడంలో బెంగాల్ సఫలమైంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ చివరి బంతికి బారోత్ అవుట్ కాగానే ఇరు జట్లు ఆటగాళ్లు కరచాలానికి సిద్ధపడ్డారు.
►1 సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి. 1950–51 సీజన్ నుంచి జట్టు ఈ పేరుతో బరిలోకి దిగుతోంది. అంతకుముందు సౌరాష్ట్రకు పూర్వ రూపంగా ఉన్న, ఇదే ప్రాంతానికి చెందిన రెండు జట్లు నవానగర్ (1936–37), వెస్టర్న్ ఇండియా (1943–44) రంజీల్లో విజేతలుగా నిలిచాయి. ఆ రెండు సార్లు ఫైనల్లో బెంగాలే ఓడింది.
►12 రంజీల్లో అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. 14 సార్లు తుది పోరుకు అర్హత సాధించిన బెంగాల్ 2 సార్లు మాత్రమే టైటిల్ అందుకోగలిగింది. బెంగాల్ ఆఖరిసారిగా 1989–90లో టైటిల్ సాధించింది.
►67 ఈ సీజన్‌లో జైదేవ్ ఉనాద్కట్ తీసిన వికెట్లు. రంజీ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జైదేవ్ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది బిహార్ బౌలర్ అశుతోష్ అమన్ 68 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment