సౌరవ్ ఘోశల్ రికార్డు
మాంచెస్టర్: భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా ఘోశల్ రికార్డులకెక్కాడు. హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఘోశల్ 3-2 తేడాతో అన్‌సీడెడ్ హెన్రిక్ ముస్టోనెన్‌పై నెగ్గాడు. తొలి రెండు గేమ్‌లను 5-11, 8-11తో ఓడినప్పటికీ 27 ఏళ్ల ఘోశల్ పట్టు వీడలేదు. వరుసగా మూడు గేమ్‌ల్లో బంతిపై పూర్తి పట్టు సాధిస్తూ 11-8, 11-4, 11-2 తేడాతో రెచ్చిపోయాడు.
‘నా దృష్టిలో ఇది పెద్ద ఘనత. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా క్వార్టర్స్ చేరుకున్నాను. ప్రపంచ అత్యుత్తమ ఎనిమిది మంది ఆటగాళ్లతో కలిసి బరిలో ఉండడం సంతోషాన్నిస్తోంది. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ఈ దశకు చేరాను. ఈ టైటిల్ గెలవాలని ప్రతీ స్క్వాష్ ఆటగాడు భావిస్తాడు. నా విజయాలు భారత్‌లో ఈ ఆటకు ఆదరణ తేవాలని కోరుకుంటున్నాను’ అని కోల్‌కతాకు చెందిన ఈ ఆటగాడు అన్నాడు. అయితే సెమీస్‌లో తనకు గట్టి పోటీ ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ ర్యామీ అషౌర్ (ఈజిప్టు)ను ఢీకొనబోతున్నాడు.