క్వార్టర్‌ ఫైనల్లో మనిక బత్రా | Manika Batra stormed into quarter finals of the World TT Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో మనిక బత్రా

Oct 27 2024 5:56 AM | Updated on Oct 27 2024 9:30 AM

Manika Batra stormed into quarter finals of the World TT Championship

న్యూఢిల్లీ: భారత స్టార్‌ మహిళా టేబుల్‌టెన్నిస్‌ ప్లేయర్‌ మనిక బత్రా ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజకు మాత్రం నిరాశ ఎదురైంది. ఆమె తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. ఫ్రాన్స్‌లోని మాంట్‌పిలియెర్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో మనిక తనకన్నా ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న రొమేనియా స్టార్‌ బెర్నాడెట్‌ సాక్స్‌కు షాకిచ్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్‌ మనిక 3–1 (11–9, 6–11, 13–11, 11–9)తో టోర్నీ ఎనిమిదో సీడ్‌ ప్రపంచ 14వ ర్యాంకర్‌ బెర్నాడెట్‌ను కంగుతినిపించింది. 

ఇద్దరు చెరో గేమ్‌ గెలిచి పోటాపోటీగా దూసుకెళ్తున్న తరుణంలో మూడో గేమ్‌లో మనిక పోరాటపటిమ మ్యాచ్‌లో గెలిచేందుకు దోహదం చేసింది. రెండు గేమ్‌ పాయింట్లను కాపాడుకున్న ఆమె ప్రత్యర్థిని ఓడించి 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో గేమ్‌లోనూ ఇదే ఆటతీరును కొనసాగించి మ్యాచ్‌లో గెలిచింది. మెరుగైన రొమేనియన్‌ క్రీడాకారిణిని 29 నిమిషాల్లోనే ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ పోటీల్లో 5–5తో సమంగా నిలువగా తాజా విజయంతో భారత ప్లేయర్‌ 6–5తో పైచేయి సాధించింది. 

పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ భారత స్టార్‌ 3–2తో బెర్నాడెట్‌ సాక్స్‌ను ఓడించింది. తొలి రౌండ్‌ పోరులో శ్రీజ 2–3 (11–6, 7–11, 1–11, 11–8, 8–11)తో ప్రపంచ 13వ ర్యాంకర్‌ అడ్రియాన డియాజ్‌ (ప్యూర్టోరికో) చేతిలో ఓడిపోయింది. క్వార్టర్‌ ఫైనల్లో మనిక.. చైనాకు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్‌ క్వియన్‌తో తలపడనుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3–0తో చైనాకే చెందిన టాప్‌సీడ్‌ వాంగ్‌ యిదిని ఓడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement