ముద్గల్ కమిటీ నివేదికలో తేడాలున్నాయి
కోర్టుకు తెలిపిన బీసీసీఐ
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్‌పై సుప్రీం కోర్టుకు సమర్పించిన ముద్గల్ కమిటీ నివేదికలో తేడాలున్నాయని సుప్రీం కోర్టుకు బీసీసీఐ తెలిపింది. ఈ కమిటీ నివేదికపై బోర్డు తమ స్పందనను గురువారం తెలిపింది. త్రిసభ్య కమిటీ త మ నివేదికను రెండు భాగాలుగా కోర్టుకు సమర్పించింది. రిటైర్డ్ జస్టిస్ ముద్గల్, అడిషినల్ సొలిసిటర్ జనరల్ నాగేశ్వర్ రావు ‘వాల్యూమ్ వన్’ పేరిట ఓ నివేదిక ఇవ్వగా.. అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ పాలకమండలి సభ్యుడు నీలయ్ దత్తా అనుబంధ నివేదిక ఇచ్చారు.
అయితే బెట్టింగ్‌లో గురునాథ్ పాత్ర స్పష్టంగా ఉందని, ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని కాబట్టి కోర్టు ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని ముద్గల్ నివేదిక సూచించింది. కానీ గురునాథ్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రూల్స్‌ను అతిక్రమించినట్టు తేలితే వారిపై చర్య తీసుకోవాల్సింది కూడా లీగ్ పాలక మండలేనని దత్తా తన నివేదికలో పేర్కొన్నారు. దీనికి బోర్డు మద్దతిస్తూ ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది.
‘ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒప్పందం క్లాజు 11.3ని చెన్నై జట్టు అతిక్రమించిన విషయంపై ఈ రెండు నివేదికలు విభేదిస్తున్నాయి. ముద్గల్ నివేదిక చెన్నై జట్టును దోషిగా తేలిస్తే... దత్తా రిపోర్ట్ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. గురునాథ్ ఆ జట్టుకు యజమాని అని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం అతడిని యజమానిగా చెప్పుకునే అర్హత లేదని దత్తా తన నివేదికలో స్పష్టం చేశారు’ అని బీసీసీఐ కోర్టుకు తెలిపింది.
ఐపీఎల్ కౌన్సిలే చర్య తీసుకుంటుంది
Published Sat, Mar 8 2014 1:34 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement