
ముద్గల్ కమిటీకి మరో రెండు నెలలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బె ట్టింగ్‌పై విచారణ సాగిస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తుది నివేదిక కోసం సుప్రీం కోర్టు మరో రెండు నెలల సమయం పొడిగించింది. గత మే16న శ్రీనివాసన్, 12 మంది క్రికెటర్లపై విచారణ సాగించేందుకు కోర్టు ముద్గల్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి ఆగస్టు చివర్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 29న కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. అయితే భారత క్రికెటర్లలో కొందరి స్టేట్‌మెంట్స్ రికార్డు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తుది నివేదికకు మరికొంత సమయం కావాలని కోరింది. దీంతో కోర్టు రెండు నెలల సమయాన్ని పొడిగిస్తూ విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది.
శ్రీనివాసన్ అభ్యర్థనకు తిరస్కారం
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు అనుమతించాలన్న ఎన్.శ్రీనివాసన్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ నుంచి క్లీన్‌చిట్ వచ్చే వరకు ఆ పదవిని చేపట్టే వీల్లేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్‌ఎమ్ ఇబ్రహీం కలీఫుల్లాతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ముద్గల్ నివేదికలో శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఉంటే బయటపెట్టాలని, అలా లేనిపక్షంలో బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించాలని లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. అయితే రిపోర్టులో శ్రీనికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యానాలు లేకపోయినా విచారణ పూర్తి కాలేదు కాబట్టి అనుమతించలేమని బెంచ్ తేల్చి చెప్పింది.