
► 21 ఓవర్లు 57 పరుగులు
► 2 వికెట్లు
వర్షంతో దాదాపుగా తుడిచి పెట్టుకుపోయిన ఆట... మళ్లీ శ్రీలంక బౌలింగ్ మెరుపులు... మరో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం... నేనున్నానంటూ పట్టుదల చూపించిన పుజారా... క్యాలెండర్‌లో తేదీ మారడం తప్ప ఈడెన్ గార్డెన్స్‌లో సీన్ మారలేదు. తొలి టెస్టు మొదటి రోజులాగే రెండో రోజు ఆట కూడా వాన కారణంగా అవాంతరం ఎదుర్కొని చివరకు అర్ధాంతరంగానే ఆగిపోయింది. తొలి రోజు లక్మల్ దెబ్బకు అల్లాడిన భారత్ మరో పేసర్ షనకకు రెండు వికెట్లు అప్పగించింది. అయితే ఒక ఎండ్‌లో గోడలా నిలబడ్డ పుజారా కొన్ని చక్కటి షాట్లతో అలరించడం విశేషం.
కోల్‌కతా: భారత్, శ్రీలంక తొలి టెస్టును వర్షం వెంటా డుతోంది. వరుసగా రెండో రోజు కూడా మ్యాచ్ వాన బారిన పడటంతో కేవలం 21 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (102 బంతుల్లో 47 బ్యాటింగ్; 9 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రహానే (4), అశ్విన్ (4) వికెట్లు కోల్పోయింది. పేసర్ షనక ఈ రెండు వికెట్లు తీశాడు.
షనక వంతు...
ఓవర్‌నైట్ స్కోరు 17/3తో భారత్ తమ ఇన్నింగ్స్‌ను శుక్రవారం కొనసాగించింది. అయితే పిచ్ తొలి రోజులాగే సీమ్‌కు అనుకూలంగా ఉండటంతో లంక కెప్టెన్ చండిమాల్ అదే వ్యూహాన్ని అనుసరించాడు. వికెట్‌పై ఉన్న పచ్చికను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఒక ఎండ్‌లో ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో, మరో ఎండ్ నుంచి మీడియం పేసర్ షనకతో బౌలింగ్ చేయించాడు. ఇది లంకకు మంచి ఫలితాన్ని అందించింది. లక్మల్ బౌలింగ్‌లో అదృష్టవశాత్తూ లభించిన బౌండరీతో రహానే ఖాతా తెరిచాడు. వరుసగా 46 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వని లక్మల్ ఇచ్చిన తొలి పరుగులు ఇవి! అయితే కొద్ది సేపటికే షనక బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని డ్రైవ్ చేయబోయిన రహానే కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత అశ్విన్ కూడా ఇదే తరహాలో ఆడబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో కరుణరత్నే క్యాచ్‌తో వెనుదిరిగాడు. మరో 6.5 ఓవర్ల తర్వాత వాన రావడంతో మ్యాచ్ పూర్తిగా ఆగిపోయింది. 2010లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు సొంతగడ్డపై 50 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.
బౌండరీల జోరు...
ఇతర బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన కనబర్చినా పుజారా తనదైన శైలిలో పట్టుదలను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లోని వాతావరణ పరిస్థితుల తరహాలోనే ఉండే కౌంటీ క్రికెట్‌లో ఇటీవలే నాటింగ్‌హామ్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన పుజారాకు ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది. దుర్భేద్యమైన డిఫెన్స్‌ను ప్రదర్శించిన పుజారా చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 24 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు గమగే విసిరిన బౌన్సర్ కుడి బొటన వేలికి బలంగా తగలడంతో అతను చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది కూడా. షనక తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన పుజారా, ఆ తర్వాత అతని బౌలింగ్‌లోనే మరో రెండు బౌండరీలు బాదాడు. చండిమాల్ పార్ట్‌టైమర్ కరుణరత్నేతో బౌలింగ్ చేయించగా... పుజారా రెండు చక్కటి ఫోర్లతో ఆధిపత్యం ప్రదర్శించాడు. కరుణరత్నే ఓవర్లోనే సాహా కూడా మరో ఫోర్ కొట్టాడు. సీనియర్ స్పిన్నర్ హెరాత్‌తో కనీసం ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం ఈ పిచ్‌పై శ్రీలంకకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.
► 46 తొలి పరుగు ఇవ్వడానికి ముందు లక్మల్ విసిరిన డాట్ బంతులు. 2001లో ఆస్ట్రేలియాతో జెరోమ్ టేలర్ (వెస్టిండీస్) 40 బంతుల తర్వాత తొలి పరుగు ఇవ్వగా...మళ్లీ ఇంత పొదుపైన బౌలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి.
ఆగని వాన...
తొలి రోజు వృథా అయిన సమయాన్ని సరిదిద్దేందుకు రెండో రోజు శుక్రవారం ఆటలో అర గంట సమయాన్ని తొలి, చివరి సెషన్‌లో 15 నిమిషాల చొప్పున సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. దాంతో ఉదయం 9.15కే ఆట ప్రారంభమైంది. అయితే వర్షం ముంచెత్తడంతో 11 గంటలకు ఆట ఆగిపోయింది. దాంతో నిర్ణీత సమయానికి పది నిమిషాల ముందు 11.20కు అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని సార్లు వాన తెరిపినిచ్చినా ఆటకు అనుకూల వాతావరణం మాత్రం ఏర్పడలేదు. మధ్యాహ్నం 2.10 గంటలకు వర్షం మరింత పెరిగింది. దాంతో మరో 20 నిమిషాల తర్వాత రెండో రోజు ఆటను పూర్తిగా రద్దు చేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment