అద్వితీయం...  | India beat australia in first test match | Sakshi
Sakshi News home page

అద్వితీయం... 

Published Tue, Dec 11 2018 12:29 AM | Last Updated on Tue, Dec 11 2018 4:41 AM

India beat australia in first test match - Sakshi

...టీమిండియా గెలిచింది! ముందు రోజే ఊరించిన విజయం ఓ దశలో అందీ  అందనట్టుగా మారినా, ఆరు వికెట్లు తీయడానికి ఆపసోపాలు పడినా, ఒక్కో భాగస్వామ్యం బలపడుతూ గుబులు రేపినా, తమకే సొంతమైన పోరాటంతో ఆస్ట్రేలియా చుక్కలు చూపినా... చిక్కుముడులన్నీ విప్పుకొంటూ కోహ్లి సేన అద్వితీయ విజయం సాధించింది. అడిలైడ్‌ టెస్టుతో పాటు కంగారూ గడ్డపై తొలిసారిగా ‘సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌’ను నెగ్గిన ఘనతనూ తమ ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌ గడ్డపై మెల్‌బోర్న్‌ తర్వాత మరో మైదానంలో రెండో టెస్టు విజయాన్ని సొంతం చేసుకుంది. 

అడిలైడ్‌: తక్కువ రన్‌రేట్, మోస్తరు స్కోర్లతో, పెద్దగా మెరుపుల్లేకుండా, ఐదు రోజులూ సాదాసీదాగానే సాగిన అడిలైడ్‌ టెస్టు కాస్తంత ఉత్కంఠభరితంగానే ముగిసింది. భారత బౌలింగ్‌కు ఎదురొడ్డిన ఆస్ట్రేలియా లోయరార్డర్‌ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నంత పనిచేసింది. కానీ, పట్టువిడవని ప్రయత్నంతో టీమిండియా నెగ్గుకొచ్చింది. 323 పరుగుల లక్ష్యానికి గాను చేతిలో ఉన్న 6 వికెట్లతో చివరి రోజు 219 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆతిథ్య జట్టు 291 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి టెస్టును కోహ్లి సేన 31 పరుగులతో కైవసం చేసుకుంది. అయితే, దీని వెనుక కొంత డ్రామా నడిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 104/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కంగారూలు చివరి ఆరు వికెట్లకు ఏకంగా 176 పరుగులు జోడించి ఆందోళన కలిగించారు. షాన్‌ మార్‌‡్ష (166 బంతుల్లో 60; 5 ఫోర్లు) అర్ధ శతకానికి తోడు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (73 బంతుల్లో 41; 4 ఫోర్లు), కమిన్స్‌ (121 బంతుల్లో 28; 3 ఫోర్లు), స్టార్క్‌ (44 బంతుల్లో 28; 2 ఫోర్లు), నాథన్‌ లయన్‌ (47 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు) పోరాటంతో ఆటను ఆసక్తి కరంగా మార్చారు. షమీ (3/65), బుమ్రా (3/68), అశ్విన్‌ (3/92) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి కథ ముగించారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీతో విశేషంగా రాణించిన పుజారాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. రెండో టెస్టు ఈ నెల 14 నుంచి పెర్త్‌లో ప్రారంభమవుతుంది. 

ఎక్కడ నుంచి ఎక్కడకు... 
41, 31, 41, 31, 32 చివరి ఐదు వికెట్లకు ఆసీస్‌ భాగస్వామ్యాలివి. దీనినిబట్టే సోమవారం మ్యాచ్‌ ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. ఆదివారమే నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఔటైనా లోయరార్డర్‌ మొండితనంతో ఆ జట్టు తీవ్ర పోటీ ఇవ్వగలిగింది. క్రితం రోజు స్కోరుకు మూడు పరుగులే జత చేసిన ట్రావిడ్‌ హెడ్‌ (14)ను ఇషాంత్‌ ఆరంభంలోనే వెనక్కు పంపాడు. పైన్‌ అండగా మార్‌‡్ష ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో బౌండరీతో 146 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. సాధికారికంగా ఆడుతూ క్రమంగా బలపడుతున్న ఈ జోడీ సవాల్‌గా మారేలా కనిపించింది. అయితే, లంచ్‌కు ముందు మార్‌‡్షను, విరామం తర్వాత రెండో ఓవర్లోనే పైన్‌ను ఔట్‌ చేసి బుమ్రా ముప్పు తప్పించాడు. అప్పటికి పరిస్థితి 187/7. దాదాపు రెండు సెషన్ల ఆట మిగిలే ఉంది. దీంతో కంగారూల పనైపోయినట్లేనని అంతా భావించారు. కానీ, కమిన్స్, స్టార్క్‌ 16 ఓవర్ల పాటు పోరాడారు. కమిన్స్‌ క్రీజులో పాతుకుపోగా, స్టార్క్‌ పరుగులు చేశాడు. ఈ దశలో స్టార్క్‌ను ఔట్‌ చేసి షమీ బ్రేక్‌ ఇచ్చాడు. ఏకంగా 121 బంతులు ఆడిన కమిన్స్‌... బుమ్రా బౌలింగ్‌లో స్లిప్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చాడు. అడపాదడపా పరుగులు చేస్తూ వచ్చిన లయన్‌ ఉత్కంఠను ఇం కాస్త పెంచాడు. మధ్యలో ఇషాంత్‌ శర్మ  బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికినా నోబాల్‌ కావడంతో లయన్‌ ఊపిరి పీల్చుకున్నాడు. హాజల్‌వుడ్‌ (13) సహకారంతో అతడు లక్ష్యాన్ని క్రమంగా 30ల్లోకి తెచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు కొంత ఒత్తిడికి గురయ్యారు. ఈ స్థితిలో అశ్విన్‌ బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో కోహ్లి సేన సంబరాల్లో మునిగిపోయింది. 

ఒకే టెస్టులో అత్యధికంగా 11 క్యాచ్‌లు పట్టిన తొలి భారతీయ వికెట్‌ కీపర్‌గా, ఓవరాల్‌గా మూడో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ రికార్డు నెలకొల్పాడు. గతంలో రసెల్‌ (ఇంగ్లండ్‌; 1995లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో)... డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా; 2013లో పాక్‌పై జొహన్నెస్‌బర్గ్‌)లో ఈ ఘనత సాధించారు. భారత్‌ తరఫున వృద్ధిమాన్‌ సాహా (10 క్యాచ్‌లు; కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 2018లో) రికార్డును పంత్‌ తిరగరాశాడు.  

ఒక్క విజయం సరిపోదు! 
కమిన్స్‌ను ఔట్‌ చేశాక మ్యాచ్‌ మా వైపు తిరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో, ఒత్తిడి సమయంలోనూ ప్రశాంతంగా మంచు గడ్డలా ఉన్నానని నేను చెప్పను. కానీ దానిని బయటకు కనపడనీయకుండా చూడాలి. విజయానికి ఒక మంచి బంతి సరిపోతుందని తెలుసు. గతంలో ప్రత్యర్థిపై ఒత్తిడిని కొనసాగించలేకపోయేవాళ్లం. గెలిచే అర్హత మా జట్టుకే ఉంది. ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఎంతో పట్టుదల కూడా ప్రదర్శించాలి. వారు అంత సులభంగా లొంగరని, లోయర్‌ ఆర్డర్‌ గట్టి పోటీనిస్తుందని తెలుసు. నాలుగేళ్ల క్రితం 48 పరుగులతో ఓటమి వైపు నిలిస్తే ఇప్పుడు 31 పరుగులతో విజయం మా వైపు నిలబడింది. ఐదు రోజుల పాటు శారీరకంగా, మానసికంగా కూడా చాలా శ్రమించాం. అదే ఫలితం రూపంలోకనిపించింది కాబట్టి ఈ గెలుపు ప్రత్యేకమైంది. నలుగురు బౌలర్లతోనే ఆడి కూకాబుర్రా బంతితో 20 వికెట్లు తీయడం చాలా గర్వంగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మా పేసర్లు చాలా బాగా బౌలింగ్‌ చేశారు. అశ్విన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కట్టడి చేయాలనే కోరుకున్నాం. ఎందుకంటే అతిగా ఆలోచించి అటాకింగ్‌ కోసం ప్రయత్నిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించేస్తారు. తొలి ఇన్నింగ్స్‌లో తొందరపడ్డా రెండో ఇన్నింగ్స్‌లో తగిన సమయం తీసుకొని మేం బ్యాటింగ్‌ చేశాం. పరిస్థితిని బట్టి చూస్తే రాహుల్‌ చేసిన 44 పరుగులు కూడా విలువైనవే. తొలి రోజు కొంత వెనుకబడిన సమయంలో పుజారా ఆదుకున్నాడు. ఆ తర్వాత మేం మరో అవకాశం ఇవ్వలేదు. రెండు జట్ల మధ్య పుజారానే ప్రధాన తేడా అనడంలో సందేహం లేదు. రహానే కూడా బాగా ఆడాడు. మా మిడిలార్డర్, లోయరార్డర్‌ ఇంకా మెరుగ్గా ఆడితే బాగుండేది. పెర్త్‌ టెస్టులో ఈ విషయంపై దృష్టి పెడతాం. అయితే తొలి మ్యాచ్‌లో నెగ్గి 1–0తో ముందంజ వేయడం చాలా సంతోషకర విషయం.   గతంలోనైతే మేం బాగా ఆడాం కానీ ఓడిపోయాం అని తరచుగా వినేవాళ్లం. ఇప్పుడు కనీసం ఆ మాట గురించి కూడా ఆలోచించడం లేదు. బాగా ఆడి కూడా ఓడిపోవడం అంటే అర్థమే లేదు. ప్రతీ మ్యాచ్‌ గెలవడమే మా లక్ష్యం. ఈ టెస్టులో గెలిస్తే మేం గెలవాలి లేదా డ్రా కావాలే తప్ప ఓటమి అన్న ఆలోచనే రాలేదు. సిరీస్‌లో ఇదే ఆలోచనా ధోరణి కొనసాగాలని కోరుకుంటున్నా. ఈ గెలుపు చాలా ఆనందాన్నిచ్చింది. అయితే ఒక్క విజయంతోనే సంతృప్తి పడం. ఈ జోరును కొనసాగించడం అవసరం. తొలిసారి ఆసీస్‌ గడ్డపై ఆధిక్యం అందుకోవడం జట్టులో అమిత విశ్వాసం నింపింది.   
   – విరాట్‌ కోహ్లి

►టాస్‌ గెలిచిన తర్వాత విరాట్‌ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టెస్టులోనూ ఓడిపోలేదు. కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ మొత్తం 43 టెస్టులు ఆడగా... ఇందులో 20 టెస్టుల్లో కోహ్లి టాస్‌ గెలిచాడు. 17 టెస్టుల్లో భారత్‌కు విజయం దక్కగా... మరో మూడు ‘డ్రా’గా ముగిశాయి.  

►ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై విజయం అందుకున్న తొలి ఆసియా, భారత కెప్టెన్‌ కోహ్లి. ఒకే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు విజయాలు సాధించిన తొలి ఆసియా జట్టుగా కూడా భారత్‌ గుర్తింపు పొందింది.   

►సొంతగడ్డపై సీజన్‌ తొలి టెస్టులోనే ఓడిపోవడం ఆస్ట్రేలియాకిది మూడోసారి. 1988లో వెస్టిండీస్‌ (బ్రిస్బేన్‌లో) చేతిలో... 2016లో దక్షిణాఫ్రికా (పెర్త్‌) చేతిలో... 2018లో భారత్‌ (అడిలైడ్‌) చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది.  

►ఆసియా వెలుపల ఒకే ఏడాది భారత్‌ మూడు టెస్టుల్లో గెలుపొందడం ఇది రెండోసారి. 1968లో న్యూజిలాండ్‌లో భారత్‌ మూడు టెస్టుల్లో విజయం సాధించింది.  

►ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ ఆరు టెస్టుల్లో గెలిచింది. పెర్త్‌ (2008), సిడ్నీ (1978) మైదానాల్లో ఒక్కో విజయం దక్కగా.. మెల్‌బోర్న్‌ (1977–78; 1981), అడిలైడ్‌ (2003, 2018)లలో రెండేసి విజయాలు లభించాయి.  

►పాకిస్తాన్‌ తర్వాత (1979లో మెల్‌బోర్న్‌ టెస్టు) ఆస్ట్రేలియాతో వారి గడ్డపై జరిగిన సిరీస్‌లో తొలి టెస్టులోనే గెలిచిన రెండో ఆసియా జట్టు భారత్‌.  

►సిరీస్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. ప్రతీ దశలో భారత్‌ ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ పుజారా, రెండో ఇన్నింగ్స్‌లో రహానే కీలక ఇన్నింగ్స్‌లు ఆడితే నలుగురు బౌలర్లు తమ వంతు పాత్ర పోషించారు. 2003 మ్యాచ్‌ జ్ఞాపకాలను ఈ టెస్టు తట్టిలేపింది.   
 – సచిన్‌ టెండూల్కర్‌  

►ఆసీస్‌ లోయర్‌ ఆర్డర్‌ పట్టుదల ప్రదర్శించింది. అయితే ఈ క్షణం భారత్‌కు చిరస్మరణీయం. బౌలర్లు సత్తా చాటారు. ఈ విజ యాన్ని ఆస్వాదిస్తూ పెర్త్‌ టెస్టులోనూ జోరు కొనసాగించాలి.     –వీవీఎస్‌ లక్ష్మణ్‌  

►టెస్టు క్రికెట్, అందులోని డ్రామా అంటే నాకు చాలా ఇష్టం. ఆసీస్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పోరాడటం నచ్చింది. టెస్టు క్రికెట్‌లో అదే అందం. అద్భుతమైన మ్యాచ్‌. విరాట్‌ కోహ్లి, అతని సహచరులకు అభినందనలు.     
– షేన్‌ వార్న్‌ 

►భారత జట్టుకు అభినందనలు. విరాట్‌ బృందం అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సమష్టి ప్రదర్శనను మున్ముందు కొనసాగించాలి. 2003–04 అడిలైడ్, 2007–08 పెర్త్‌ టెస్టులలాగే ఈ విజయం కూడా ప్రత్యేకం. 11 క్యాచ్‌లు అందుకున్న పంత్‌కు ప్రత్యేక అభినందనలు.  
    – వినోద్‌ రాయ్, సీఓఏ చీఫ్‌  
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement