
దంబుల్లా: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (92; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (71; 6 ఫోర్లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో... శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... రెండో మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజేతను నిర్ణయించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
వెటరన్ పేసర్ మలింగ (5/44) చెలరేగడంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మోర్గాన్, రూట్ మినహా మిగతావారు విఫలమయ్యారు. అనంతరం 279 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 29 ఓవర్లలో 140/5తో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికి శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచింది. ధనంజయ డిసిల్వా (36 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), పెరీరా (44 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో వన్డే బుధవారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment