చెల్లి... మళ్లీ...
♦ అక్క వీనస్‌పై చెల్లెలు సెరెనా గెలుపు
♦ యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశం
ప్రత్యర్థి ఎవరైనా తన ప్రతాపం చూపిస్తూ... ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత దారిలో ఉన్న ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ లక్ష్యం వైపు ముందంజ వేస్తోంది. తాజాగా సెరెనా ‘షో’ ధాటికి ఆమె అక్క వీనస్ విలియమ్స్ కూడా ఇంటిదారి పట్టక తప్పలేదు. జులైలో వింబుల్డన్ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ అక్కా చెల్లెళ్ల పోరాటంలో చెల్లి సెరెనాయే పైచేయి సాధించగా... యూఎస్ ఓపెన్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
న్యూయార్క్ : ‘ఎన్నో ఘనతలు’ తన పేరిట లిఖించుకునేందుకు సెరెనా విలియమ్స్ సిద్ధమవుతోంది. 27 ఏళ్ల తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందేందుకు మరో రెండు విజయాల దూరంలో నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచిన సెరెనా... సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. తన సోదరి వీనస్ విలియమ్స్ (అమెరికా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సెరెనా అద్భుత విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ సెరెనా 6-2, 1-6, 6-3తో వీనస్‌ను ఓడించింది.
►ఆర్థర్ యాష్ ప్రధాన స్టేడియంలో ఇద్దరు దిగ్గజాలు సెరెనా, వీనస్ నడుమ జరిగిన పోరును దాదాపు 24 వేల మంది ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు తిలకించారు. సెరెనా ఫైనల్‌కు చేరుతుందనే నమ్మకమో ఏమోగానీ టోర్నీ ప్రారంభానికి ముందే మహిళల సింగిల్స్ ఫైనల్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
►ఇప్పటికే యూఎస్ ఓపెన్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచిన సెరెనా ఏడోసారి విజయంతో ఓపెన్ శకంలో రికార్డు సృష్టించాలనే పట్టుదలతో ఉంది. సెరెనాను నిలువరించే సత్తాగల క్రీడాకారిణుల్లో ఒకరైనా సోదరి వీనస్ నుంచి ఆమెకు గట్టిపోటీనే లభించింది. రెండుసార్లు వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తొలి సెట్‌ను 33 నిమిషాల్లో దక్కించుకుంది.
►రెండో సెట్‌లో పరిస్థితి తారుమారైంది. తన చెల్లి ఆటతీరులోని బలహీనతలపై అవగాహన ఉన్న వీనస్ వెంటనే తేరుకుంది. నిలకడగా ఆడుతూ రెండుసార్లు సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన వీనస్ రెండో సెట్‌ను 30 నిమిషాల్లో సొంతం చేసుకోవడంతో నిర్ణాయక మూడో సెట్ అనివార్యమైంది.
►1997లో అరంగేట్రంలోనే యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన వీనస్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడినా మూడో సెట్‌లో సెరెనా జోరును అడ్డుకోలేకపోయింది. కీలకదశలో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని 35 నిమిషాల్లో మూడో సెట్‌ను సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
►మ్యాచ్ మొత్తంలో సెరెనా 12 ఏస్‌లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 11 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 35 విన్నర్స్ కొట్టి, 22 అనవసర తప్పిదాలు చేసింది.
►ఈ గెలుపుతో వీనస్‌తో ముఖాముఖి రికార్డులో సెరెనా 16-11తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వీనస్‌పై తొమ్మిదిసార్లు నెగ్గిన సెరెనా ఐదుసార్లు ఓడిపోయింది. చివరిసారి 2008 వింబుల్డన్ ఫైనల్లో వీనస్ చేతిలో సెరెనా ఓటమి పాలైంది.
►సెమీస్‌లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి రొబెర్టా విన్సీ (ఇటలీ)తో సెరెనా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో విన్సీ 6-3, 5-7, 6-4తో క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది. తన కెరీర్‌లో 44వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న విన్సీ తొలిసారి సెమీస్‌కు చేరడం విశేషం. విన్సీతో ముఖాముఖి రికార్డులో సెరెనా 4-0తో ఆధిక్యంలో ఉంది. మరో క్వార్టర్ ఫైనల్లో 26వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 4-6, 6-4, 6-2తో ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.