'ఇదే నా చివరి క్రికెట్ సిరీస్'
కొలంబో:స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ వీడ్కోలు తీసుకోనున్నాడు. ఈ సిరీస్ తరువాత మొత్తం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నట్లు దిల్షాన్ తాజాగా ప్రకటించాడు. ఇప్పటికే సుదీర్ఘ క్రికెట్ ఆడిన తనకు ఆసీస్ సిరీసే చివరదని పేర్కొన్నాడు.
2013లో టెస్టులకు దూరమైన దిల్షాన్.. ఆసీస్తో జరుగుతున్న ఐదు వన్డే సిరీస్లో సభ్యుడు. అయితే ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో దిల్షాన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి వన్డేలో 22 పరుగులు చేయగా, రెండో వన్డేలో 10 పరుగులు చేశాడు.
1999లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన దిల్షాన్ ఇప్పటివరకూ 329 వన్డేలు ఆడాడు.ఇందులో 22 సెంచరీలు,47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో దిల్షాన్ అత్యధిక స్కోరు 161 కాగా,యావరేజ్ 39. 26, స్ట్రైక్ రేట్ 86.34గా ఉంది. ఇక బౌలింగ్ లో 106 వికెట్లు పడగొట్టాడు.