ఆటకు దిల్షాన్ టాటా
ఆస్ట్రేలియాతోనే ఆఖరి వన్డే, టి20లు
మూడేళ్ల క్రితమే టెస్టులకు వీడ్కోలు
కొలంబో: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఇదివరకే టెస్టు కెరీర్‌కు బైబై చెప్పిన 39 ఏళ్ల లంక బ్యాట్స్‌మన్ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించినట్లు లంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తెలిపింది. దంబుల్లాలో ఆస్ట్రేలియాతో ఈ నెల 28న జరిగే మూడే వన్డేనే అతని కెరీర్‌లో ఆఖరి 50 ఓవర్ల మ్యాచ్. నాలుగు, ఐదు వన్డేలు ఆడడు. అనంతరం వచ్చే నెల 6, 9 తేదీల్లో ఆస్ట్రేలియాతో రెండు టి20మ్యాచ్‌లు జరుగుతాయి. 9న జరిగే రెండో టి20తో దిల్షాన్ 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగియనుంది. 1999లో జింబాబ్వేలో లంక పర్యటనతో అతను టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఆదివారం అతను ఆడే చివరి వన్డే తన కెరీర్‌లో 330వ మ్యాచ్. ఇప్పటివరకు 302 ఇన్నింగ్స్‌లలో దిల్షాన్ 39.26 సగటుతో 10, 248 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 47 అర్ధసెంచరీలున్నాయి.
అత్యధిక స్కోరు 161 నాటౌట్. తన ఆఫ్ బ్రేక్ బౌలింగ్‌తో వన్డేల్లో 106 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక టి20 కెరీర్‌లో 78 మ్యాచ్‌ల్లో 77 ఇన్నింగ్స్‌లాడిన దిల్షాన్ 28.98 సగటుతో 1884 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 13 అర్ధసెంచరీలు సాధించాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. మూడేళ్ల క్రితం 2013లో టెస్టుల నుంచి తప్పుకున్న ఈ లంక ఓపెనర్ 87 మ్యాచ్‌లాడాడు. 145 ఇన్నింగ్స్‌లో 40.98 సగటుతో 5492 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 193 కాగా మొత్తం 16 సెంచరీలు, 23 అర్ధసెంచరీలు సాధించాడు.