షాబుద్దీన్ నేరస్తుడు కాదు సంఘసేవకుడు
పట్నా: జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ క్రిమినల్ కాదట. సంఘసేవకుడట. ఈ మాటలన్నది కోర్టు కాదు.. ఆర్జేడీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ శైలేష్ కుమార్ అలియాస్ బులో మండల్. షాబుద్దీన్ ఇటీవల బెయిల్పై విడుదల అయినందుకు వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
శివాన్ లోక్సభ నియోజకవర్గం నుంచి షాబుద్దీన్ నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, నేరస్తుడు కాదని శైలేష్ చెప్పారు. 'శివాన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా షాబుద్దీన్కు పాపులారిటి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు' అని అన్నారు. షాబుద్దీన్ విడుదలపై బీజేపీ, మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. షాబుద్దీన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఇది ప్రభుత్వ నిర్ణయంకాదని అన్నారు. గతంలో 300 మందిని హత్య చేసిన కేసులో రణవీర్ సేన చీఫ్ బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియాకు ఇదే కోర్టు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వాన్ని నిందించడం తగదని శైలేష్ చెప్పారు.