'నాకు ఫేర్వెల్ వద్దు'
కరాచీ: ఒక ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహిస్తే క్రికెట్ నుంచి ఘనంగా వీడ్కోలు చెబుతానని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఎన్నిసార్లు ఆ దేశ క్రికెట్ బోర్డుకు విన్నవించుకున్నా పట్టించుకోని సంగతి తెలిసిందే. గతేడాది వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలంటూ ఆఫ్రిది డిమాండ్ చేసినా అతనికి ఆశాభంగమే ఎదురైంది. తొలుత ఫేర్ వెల్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన పీసీబీ.. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకుంది. ఆపై అతన్ని కాంట్రాక్ట్ జాబితా నుంచి కూడా తొలగించింది. దాంతో బాధకారంగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు ఈ వెటరన్ ఆల్ రౌండర్.
అయితే తాజాగా ఆఫ్రిదికి ఫేర్వెల్ ఆఫర్ అంటూ పీసీబీ మరోసారి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆఫ్రిదిని పాకిస్తాన్ ఎగ్జిక్యూటిర్ కమిటీ చైర్మన్ నజీమ్ సేథీ కలిసి వీడ్కోలు పార్టీపై చర్చించారు. అయితే దీన్ని ఆఫ్రిది సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను వేరు పనులతో చాలా బిజీగా ఉన్నానని, ఫేర్వెల్ పార్టీ తనకొద్దంటూ పేర్కొన్నాడు. దీనిలో భాగంగా ఫేర్వెల్ పార్టీ ఆఫర్ ఇవ్వడానికి ఎట్టకేలకు దిగివచ్చిన పీసీబీకి ధన్యవాదాలు తెలియజేశాడు ఆఫ్రిది.
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లు మిస్బావుల్ హక్ తో పాటు యూనిస్ ఖాన్లకు ఫేర్వెల్ పార్టీలు ఇచ్చే క్రమంలో ఆఫ్రిదిని కూడా సంప్రదించారు పీసీబీ పెద్దలు. అయితే ఇలా వీడ్కోలు కార్యక్రమాలు అనేవి ఆటగాళ్ల హక్కుగా ఆఫ్రిది అభివర్ణించాడు. ఇదే సంప్రాదాయాన్ని భవిష్యత్తులో సైతం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు ఆఫ్రిది పేర్కొన్నాడు.