పీసీబీపై ఆఫ్రిది ఫైర్
కరాచీ: తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని దుయ్యబడుతున్న ఆ దేశ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. పాకిస్తాన్ క్రికెట్ నుంచి ఫిక్సింగ్ భూతం విడిచివెళ్లకపోవడానికి తమ దేశ క్రికెట్ బోర్డే ప్రధాన కారణమంటూ ధ్వజమెత్తాడు. తమ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడటానికి పీసీబీ పరోక్షంగా సహకరిస్తుందని విమర్శించాడు.
'నేటికి పాకిస్తాన్ క్రికెట్ లో ఫిక్సింగ్ జరగడానికి పీసీబీనే కారణం. స్పాట్ ఫిక్సింగ్ చేసి నిషేధానికి గురైన క్రికెటర్లను తిరిగి పీసీబీ జట్టులోకి ఆహ్వానిస్తుంది. ఇది దేనికి సంకేతం. ఫిక్సింగ్ చేసిన క్రికెటర్లకు జట్టులో పునరాగమనం చేసే అవకాశం కల్సిస్తే దానికి అర్ధం ఏమిటి?, ఒకసారి జట్టు నుంచి నిషేధానికి గురై బయటకు వెళ్లిపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వకూడదు. ఆ రకంగా చేస్తేనే మన దేశంలో ఫిక్సింగ్ చర్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ విషయాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను.పీసీబీలో ఏ మాత్రం మార్పు రాలేదు. దాన్నే పాక్ ఆటగాళ్లు వారికి అనుకూలంగా మార్చుకుని ఫిక్సింగ్ లకు పాల్పడుతున్నారు. ఆ ఆటగాళ్ల వల్ల ఉపయోగం ఏమిటి 'అని ఆఫ్రిది విమర్శించాడు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇద్దరు ఆ దేశ క్రికెటర్లు షార్జిల్ ఖాన్, ఖలిద్ లతిఫ్ లు ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో వీరిపై సస్సెన్షన్ వేటు వేస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది.