అందులో వాస్తవం లేదు: ఆఫ్రిది
కరాచీ: తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలను పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఖండించాడు. తన రిటైర్మెంట్లో భాగంగా ఒక ఫేర్వెల్ మ్యాచ్ను నిర్వహించమని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని కూడా కోరలేదన్నాడు. తనకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పుడు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాలంటూ అసహనం వ్యక్తం చేశాడు. 'నేను క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ ను కొనసాగిస్తా. పాక్ క్రికెట్ బోర్డును ఫేర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయమని ఏనాడూ కోరలేదు. 20 ఏళ్ల నుంచి పాకిస్తాన్ కు ఆడుతున్నా.. పీసీబీ కోసం కాదు అనే విషయాన్నిగ్రహించాలి. ఒక మ్యాచ్ కోసం పీసీబీ అభ్యర్థించడం ఎప్పటికీ జరగదు. నన్ను నేను నమ్ముకున్నా. అంతేకానీ ఎవరిపైనా ఆధారపడలేదు.. నా మంచి కోరే స్నేహితులు, అభిమానులు నాకు అండగా ఉన్నారు' అని ఆఫ్రిది పేర్కొన్నాడు.
కొన్ని రోజుల క్రితం తన రిటైర్మెంట్ కోసం వీడ్కోలు మ్యాచ్ నిర్వహించమని పీసీబీని ఆఫ్రిది కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరల్డ్ టీ 20 అనంతరం కెప్టెన్ పదవికి గుడ్ బై చెప్పిన ఆఫ్రిదిని జట్టులో సభ్యుడిగా కూడా ఎంపిక చేయడం లేదు. దీనిలో భాగంగానే తన వీడ్కోలుకు ఒక మ్యాచ్ నిర్వహించాలంటూ ఆఫ్రిది కోరినట్లు రూమర్లు వెలుగు చూశాయి. దానిపై తాజాగా స్పందించిన ఆఫ్రిది.. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ ను పాకిస్తాన్ కోసం మాత్రమే ఆడుతున్నానని, పీసీబీ కోసం కాదని మండిపడ్డాడు. తన కెరీర్ ముగిసిపోయిందని అనుకోవడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇంకా అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడే తనలో ఉందని పీసీబీ సెలక్టర్లకు సవాల్ విసిరాడు.