ఆ క్రికెటర్ కు వీడ్కోలు మ్యాచ్ లేదు..
కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ కు సుదీర్ఘ సేవలందించిన వెటరన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలుకు ఒక మ్యాచ్ లో అవకాశం ఇవ్వాలని భావించిన పీసీబీ..ఆ చర్యలను ఉపసంహరించుకుంది. పాక్ తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో ఒకడైన షాహిద్ ఆఫ్రిది చివరి టీ 20 మ్యాచ్ ఆడించేందుకు తొలుత పీసీబీ మొగ్గు చూపింది. దీనిలో భాగంగా త్వరలో యూఏఈలో వెస్టిండీస్తో జరిగే పాక్ టీ 20 జట్టులో ఆఫ్రిదికి చోటుకల్పించాలని అనుకున్నారు. ఆ మేరకు చీఫ్ సెలక్టర్ ఇంజమామల్ హక్ కూడా విండీస్తో జరిగే ఒక మ్యాచ్ ద్వారా ఆఫ్రిది వీడ్కోలు చెబుతాడని ప్రకటించాడు కూడా. అయితే అందుకు పీసీబీ విముఖత వ్యక్తం చేసింది. బోర్డు సీనియర్ మెంబర్లో ఒకడైన నజీమ్ సేథీ మాత్రం ఆ ప్రణాళికలను విరమించుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.
ఇటీవల భారత్లో జరిగిన టీ 20 వరల్డ్కప్లో పాకిస్తాన్ ఆదిలోనే ఇంటిముఖం పట్టింది. దాంతో ఆఫ్రిది టీ 20 కెప్టెన్సీ గుడ్ బై చెప్పగా, ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో అతను ఎంపిక కాలేదు. పాక్ తరపున 398 వన్డేలు ఆడిన ఆఫ్రిది.. 98 టీ 20 మ్యాచ్లు ఆడాడు. దాంతో పాటు మూడు ఫార్మాట్లలో ఆఫ్రిది కెప్టెన్గా చేసి ఈ ఘనతను సాధించిన అరుదైన క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.