ఇయాన్ చాపెల్పై ఎదురుదాడి!
మెల్బోర్న్:ఆడటం రాకపోతే.. ఇంట్లో కూర్చోండి. అసలు ఆడటం చేతకాని జట్టును ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకు ఆహ్వానిస్తున్నారు. పాకిస్తాన్ ను ఆసీస్ ఆహ్వానించడం మానితే మంచిది'అని ఇటీవల ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ తీవ్ర విమర్శలు చేశాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా వరుస మూడు టెస్టుల్లో పాకిస్తాన్ ఓటమి అనంతరం చాపెల్ పై విధంగా మండిపడ్డాడు.
అయితే ఆదివారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. దీంతో సిరీస్ను 1-1 తో సమం చేసి పోరులో నిలిచింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎట్టుకేలకు గెలుపొందడంతో ఆ దేశ క్రికెటర్లు ఇయాన్ చాపెల్పై ఎదురుదాడికి దిగారు. 'పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ హాఫీజ్ కు అభినందనలు. పాక్ గెలిచింది కదా.. ఇయాన్ చాపెల్ ఇప్పుడేమంటావ్?, అసలు పాకిస్తాన్ గెలిచిన మ్యాచ్ను చూశావా?, ఇప్పుడు చాపెల్ ఏం చేస్తున్నాడో?అని షాహిద్ ఆఫ్రిది వ్యంగ్యస్త్రాలు సంధించాడు. మరొకవైపు పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ కూడా తీవ్రంగా చాపెల్ పై మండిపడ్డాడు. 'అదొక బాధ్యాతరాహిత్యమైన ప్రకటనే కాదు.. ఎటువంటి ఉపయోగంలేని స్టేట్మెంట్. శ్రీలంకపై ఇటీవల ఆస్ట్రేలియా వైట్ వాష్ కాలేదా?, భారత్ పై సిరీస్ను ఘోరంగా ఓడిపోలేదా? మా చేతిలో యూఏఈలో మీ వైట్వాష్ కాలేదా? మరి దాన్ని ఏమంటారు'అని మిస్బా నిలదీశాడు.
ఆసీస్ జరిగిన మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్ అయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఆడటం రాకపోతే ఇంట్లోనే కూర్చుంటే మంచిదని ధ్వజమెత్తాడు.దాంతో పాటు ఆసీస్ జట్టుకు చాపెల్ సలహా ఇచ్చేశాడు. కనీసం పోరాడని పాకిస్తాన్ క్రికెట్ జట్టును పర్యటనలకు పిలవడం ఆపితే మంచిదంటూ చాపెల్ అభిప్రాయపడ్డాడు.