పేస్‌ బౌలింగ్‌ సూపర్‌ | Shami And Umesh Yadav Shown Their Talent With Bowl | Sakshi
Sakshi News home page

పేస్‌ బౌలింగ్‌ సూపర్‌

Published Wed, Oct 23 2019 1:47 AM | Last Updated on Wed, Oct 23 2019 1:47 AM

Shami And Umesh Yadav Shown Their Talent With Bowl - Sakshi

సాక్షి క్రీడా విభాగం: ‘స్పిన్‌ పరీక్ష కోసం సన్నద్ధమై వస్తే సిలబస్‌లో లేని విధంగా భారత పేస్‌ బౌలర్లు మాకు పరీక్ష పెట్టారు’... అదో రకమైన వైరాగ్యంతో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌ దాదాపుగా ఇదే మాట చెప్పాడు. భారత జట్టు సొంతగడ్డపై టెస్టులు, సిరీస్‌లు నెగ్గడం కొత్త కాదు. మన బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించడం కూడా మొదటి సారి కాదు. మనం భారీ స్కోర్లు సాధించిన తర్వాత స్పిన్నర్లు చెలరేగిపోయి టపటపా వికెట్లు పడగొట్టడం రొటీన్‌గా జరిగిపోయేదే. కానీ ఈ సారి విజయానికో విశేషం ఉంది. సఫారీలపై మన గెలుపులో భారత పేస్‌ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ మన పేసర్లను ఎదుర్కోవడంలో ఎంత ఇబ్బంది పడ్డారో కనిపించింది. సిరీస్‌లో మన ఫాస్ట్‌ బౌలర్లు షమీ, ఉమేశ్, ఇషాంత్‌ కేవలం 17.50 సగటుతో వికెట్లు పడగొడితే రబడ, ఫిలాండర్‌లాంటి పదునైన పేసర్లతో కూడిన దక్షిణాఫ్రికా జట్టు మరీ ఘోరంగా 70.20 సగటుతో వికెట్లు తీసిందంటే మన సత్తా అర్థమవుతోంది.

మనం సొంతగడ్డపై ఆడుతున్నామని అనుకున్నా... అనుకూలంగా ఉన్న పిచ్‌లపై కూడా ఏమీ చేయలేని సఫారీలతో పోలిస్తే మన బౌలింగ్‌ ఎంత పదునుగా ఉందో ఇది చూపిస్తోంది. షమీ 3 టెస్టుల్లో 13, ఉమేశ్‌ 2 టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ 2 వికెట్లే తీసినా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాడు. స్పిన్నర్లు తీసిన 32 వికెట్లతో పోలిస్తే పేసర్లు 26 వికెట్లతో చేరువగా రావడం సాధారణంగా భారత్‌లో కనిపించని దృశ్యం. ఉమేశ్‌ యాదవ్‌ మాటల్లో చెప్పాలంటే ‘ఆరంభంలో బంతి మెరుపు పోయేలా చేసి స్పిన్నర్లకు అప్పగించడం, ఆ తర్వాత ఎప్పుడో చివర్లో రివర్స్‌ స్వింగ్‌ కోసం ప్రయత్నించడం ఇప్పటి వరకు కనిపించేది. కానీ మన బౌలింగ్‌లో పేస్, బౌన్స్‌ ఉంటే భారత్‌లో కూడా సఫలం కావచ్చని మేం రుజువు చేశాం’ అనేది అక్షర సత్యం.

భారత పిచ్‌లపై ఎలా బౌలింగ్‌ చేయాలో తమకు అర్థం అయిందని, దాని కోసం ఎంతో సాధన చేశామని షమీ చెప్పుకొచ్చాడు. తమ ఫిట్‌నెస్‌గా అద్భుతంగా మారడం కూడా అందుకు ఒక కారణమని అతను విశ్లేషించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై మన ఫాస్ట్‌ బౌలర్లు ఇంతగా ఆధిపత్యం కనబర్చడం ఎప్పుడూ చూడలేదని మాజీ క్రికెటర్లు కూడా చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇక ఈ సిరీస్‌లో నంబర్‌వన్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఉండి ఉంటే ఏం జరిగేదే ఊహించగలమా!  వీరితో పాటు కొంత కాలంగా నిలకడగా మన విజయాల్లో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్‌ కూడా మరో కీలక బౌలర్‌. రాబోయే రోజుల్లో ఈ ఐదుగురితో కూడిన మన పేస్‌ దళంనుంచి మరిన్ని అద్భుతాలు, ముఖ్యంగా విదేశాల్లో నిలకడైన విజయాలు కచ్చితంగా వస్తాయని ఆశించవచ్చు.

‘షమీ, ఉమేశ్‌ స్ట్రయిక్‌రేట్‌ చూస్తే భారత్‌లో గతంలో ఏ పేసర్లూ ఇలా బౌలింగ్‌ చేయలేదని అర్థమవుతోంది. ముఖ్యంగా స్టంప్స్‌పైకి, బ్యాట్స్‌మెన్‌ ప్యాడ్లపైకి వీరు బంతులు సంధించిన తీరు నిజంగా అద్భుతం. ఇది మన దూకుడుకు మంచి సంకేతం. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కొనసాగిస్తూ వీరు వికెట్లు తీయగలిగారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన పేసర్లు బౌలింగ్‌ చేసే సవాల్‌కు సిద్ధంగా ఉంటున్నారు. వికెట్‌ తీయాల్సిందే అన్నట్లుగా బంతిని అడిగి మరీ తీసుకుంటున్నారు.’
–విరాట్‌ కోహ్లి

ఏ పిచ్‌ అయినా ఒకటే 
పిచ్‌లు ఎలా పోతే మాకేంటి? జొహన్నెస్‌బర్గ్‌ అయినా మెల్‌బోర్న్‌ అయినా ముంబై అయినా మ్యాచ్‌ ఫలితంపై పిచ్‌ ప్రభావం లేకుండా చూడటమే మా ఉద్దేశం. ఇంత అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్, 20 వికెట్లు తీయగల బౌలర్లు ఉన్నప్పుడు ఈ విజయాలు వస్తూనే ఉంటాయి. మా జట్టు ఫెరారీ కారు తరహాలో దూసుకుపోతుంది. సాధారణంగా భారత్‌లో విజయం సాధించినప్పుడు ఒకరో, ఇద్దరికో గుర్తింపు లభిస్తుంది. కానీ ఈసారి ఆరేడుగురు ఆ జాబితాలో ఉన్నారు. షాబాజ్‌ నదీమ్‌ ఈ స్థాయికి చేరేందుకు ఎంతో శ్రమించాడు. అతను తన సొంత ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌ను ముగించడం సంతోషంగా ఉంది. ప్రతీ బంతిని కచ్చితత్వంతో వేయడం అతని అనుభవానికి నిదర్శనం.
–రవిశాస్త్రి, భారత కోచ్‌

1932లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత్‌ ఇప్పటివరకు మొత్తం 538 టెస్టులు ఆడింది. ఇందులో 155 మ్యాచ్‌ల్లో గెలిచింది. 165 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 217 టెస్టులు ‘డ్రా’ చేసుకుంది. ఒక మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. 87 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో ఓవరాల్‌గా కనీసం రెండు అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లతో జరిగిన సిరీస్‌లను భారత్‌ ‘క్లీన్‌స్వీప్‌’ చేయడం ఇది 14వసారి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్‌ క్లీన్‌స్వీప్‌ సిరీస్‌ల జాబితా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement