ఇండోర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా తొలి రెండు టెస్టుల్లాగే మూడో రోజునే ముగిసిపోయే అవకాశం ఉంది. రెండో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంది. నాథన్ లియోన్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ జట్టు గెలుపు లాంచనమే. అయితే టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ మాత్రం టీమిండియా విజయంపై ధీమా వ్యక్తం చేశాడు.
''క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. టార్గెట్ 76 పరుగులే కావొచ్చు.. కానీ రేపు(మూడోరోజు ఆటలో) ఏమైనా జరగొచ్చు. టైట్ బౌలింగ్ వేయడానికి ప్రయత్నిస్తాం. ఇండోర్ పిచ్ అంత ఈజీ వికెట్ మాత్రం కాదు. ఈ వికెట్ మా జట్టు బ్యాటర్లు కావొచ్చు.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు అయినా సరే బ్యాటింగ్ చేయడం మాత్రం కష్టం. అందునా స్కోరు తక్కువ ఉంది కదా అని హిట్టింగ్ ఆడే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది. బంతి మాత్రం వికెట్‌కు చాలా తక్కువ ఎత్తులో వెళుతుంది.. ఇది బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చు. వారికి టార్గెట్ చిన్నదే కావొచ్చు.. ఫలితం అనుకూలంగా వచ్చేందుకు మేం చేయాల్సింది చేస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఉమేశ్ యాదవ్ ఈ మధ్య కాలంలో టీమిండియాకు టెస్టులకు మాత్రమే పరిమితమ్యాడు. జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికి తుదిజట్టులో అవకాశం చాలా తక్కువగానే వస్తోంది. తాజాగా షమీకి రెస్ట్ ఇవ్వడంతో ఉమేశ్ తుది జట్టులోకి వచ్చాడు. తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.
ఇటీవలే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఉమేశ్ బౌలింగ్‌లో అదరగొట్టడం అతనికి కాస్త ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు. మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ వికెట్ తీయడం ద్వారా ఉమేశ్ స్వదేశంలో టెస్టుల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్‌గా 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్
Comments
Please login to add a commentAdd a comment