
హసీన్ జహాన్
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలవనున్నారు. ఈ మేరకు ఆమె సీఎం అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈనెల 23న మమతా బెనర్జీని వ్యక్తిగతంగా కలిసి తన బాధలను తెలియజేయడంతో పాటు తనకు మద్దతివ్వాలని ఆమె సీఎంను కోరనున్నారు.
ఇక అంతకముందు తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, షమీ అరెస్ట్ అయ్యేలా తనకు సహకరించాలని హసీన్ మీడియాను కోరారు. తన బాధను అర్థం చేసుకోవాలని, దయచేసి తనని పాయింట్ అవుట్ చేస్తూ వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
షమీ పలువురి యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని, తనని మానసికంగా వేధించాడని, షమీ సోదరుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని, పాక్ యువతితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని హసీన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. అంతటితో ఆగని హసీన్ కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని విచారణ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది. ఈ రిపోర్ట్‌పైనే షమీ భవితవ్యం ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే.