షమీ సూపర్‌ షో | Shami, Yadav keep West Indies in check | Sakshi
Sakshi News home page

షమీ సూపర్‌ షో

Published Fri, Jul 7 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

షమీ సూపర్‌ షో

షమీ సూపర్‌ షో

నాలుగు వికెట్లు తీసిన పేసర్‌
వెస్టిండీస్‌ 205/9


కింగ్‌స్టన్‌: గాయం కారణంగా రెండేళ్లు జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ మొహమ్మద్‌ షమీ (4/48) అదరగొట్టే ప్రదర్శనతో తన ఫామ్‌ను చాటుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న తను గత మ్యాచ్‌తోనే పునరాగమనం చేసినా వికెట్‌ తీయలేకపోయాడు. అయితే గురువారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో మాత్రం చెలరేగి విండీస్‌ మిడిలార్డర్‌ను వణికించాడు. ఫలితంగా విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. షాయ్‌ హోప్‌ (98 బంతుల్లో 51; 5 ఫోర్లు), కైల్‌ హోప్‌ (50 బంతుల్లో 46; 9 ఫోర్లు), హోల్డర్‌ (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్‌), పావెల్‌ (32 బంతుల్లో 31; 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్‌కు మూడు వికెట్లు దక్కాయి.

చివర్లో తడబాటు
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు లూయిస్‌ (9), కైల్‌ హోప్‌ ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హోప్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో జోరు కనబరిచాడు. ఉమేశ్, షమీ బౌలింగ్‌ను తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో లూయిస్‌ను పాండ్యా అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సిరీస్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో విండీస్‌ 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని కైల్‌ హోప్‌.. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ 16వ ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ విండీస్‌కు షాక్‌ ఇచ్చాడు. వరుస బంతుల్లో కైల్‌ హోప్, చేజ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించడంతో విండీస్‌ పరుగుల వేగం తగ్గగా 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. మొహమ్మద్‌ (16)ను కేదార్‌ జాదర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. ఈ దశలో షాయ్‌ హోప్, హోల్డర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడిన షాయ్‌ 94 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 40వ ఓవర్‌ నుంచి షమీ అనూహ్యంగా చెలరేగడంతో విండీస్‌ పతనం ప్రారంభమైంది. తన వరుస నాలుగు ఓవర్లలో జోరు మీదున్న హోల్డర్, షాయ్‌ హోప్‌తో పాటు నర్స్, బిషూ వికెట్లకు తీయడంతో విండీస్‌ వణికింది. హోల్డర్, షాయ్‌ హోప్‌ మధ్య ఐదో వికెట్‌కు అత్యధికంగా 48 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో పావెల్‌ కాస్త దూకుడు కనబరచగా స్కోరు 200 దాటింది.

స్కోరు వివరాలు:-
విండీస్‌ ఇన్నింగ్స్‌: లూయిస్‌ (సి) కోహ్లి (బి) పాండ్యా 9; కైల్‌ హోప్‌ (సి) ధావన్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 46; షాయ్‌ హోప్‌ (సి) రహానే (బి) షమీ 51; చేజ్‌ ఎల్బీడబ్లు్య (బి) ఉమేశ్‌ యాదవ్‌ 0; మొహమ్మద్‌ (సి అండ్‌ బి) కేదార్‌ జాదవ్‌ 16; హోల్డర్‌ (సి) ధావన్‌ (బి) షమీ 36; పావెల్‌ (సి) ధోని (బి) ఉమేశ్‌ 31; నర్స్‌ (సి) కుల్దీప్‌ (బి) షమీ 0; బిషూ (సి) ధోని (బి) షమీ 6; జోసెఫ్‌ నాటౌట్‌ 3; విలియమ్స్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 205.
వికెట్ల పతనం: 1–39, 2–76, 3–76, 4–115, 5–163, 6–168, 7–171, 8–182, 9–205.
బౌలింగ్‌: షమీ 10–0–48–4; ఉమేశ్‌ యాదవ్‌ 10–1–53–3; పాండ్యా 6–0–27–1; జడేజా 10–1–27–0; కుల్దీప్‌ యాదవ్‌ 10–0–36–0; కేదార్‌ జాదవ్‌ 4–0–13–1.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement