
సిడ్నీ: తమ దేశంలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ గుడ్ బై చెప్పేశాడు. ఇక బీబీఎల్ ఆడబోనంటూ వాట్సన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక‍్రవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఆడుతున్న వాట్సన్.. తమ దేశంలో జరిగే బీబీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. కాగా, కొన్ని విదేశీ లీగ్‌ల్లో మాత్రం ఆడతానంటూ పేర్కొన్నాడు. గత మూడు సీజన్ల నుంచి బీబీఎల్‌లో సిడ్నీ థండర్‌కు సారథిగా వ్యవహరిస్తున్న వాట్సన్..తన జట్టు సహచరులకు కృతజ్ఞతలు తెలిపాడు.
సిడ్నీ థండర్‌తో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, అవి ఎప్పుడూ తన మదిలో పదిలంగానే ఉంటాయన్నాడు. ప్రధానంగా నిక్ కమిన్స్, పాడీ ఆప్టన్, లీ జర్మన్, షేన్ బాండ్‌లతో తన అనుభవం ఎప్పటికీ మరచిపోలేనిదిగా పేర్కొన్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు బీబీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు.