గె(ని)లుస్తారా!
ఇక బ్యాట్స్‌మెన్‌దే భారం
భారత్ లక్ష్యం 407
ప్రస్తుతం 87/1
రెండో ఇన్నింగ్స్‌లో
కివీస్ 105 ఆలౌట్
తొలి టెస్టులో ఒక్కసారిగా చెలరేగిన బౌలర్లు భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టారు. అయితే కివీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే బాధ్యతను బ్యాట్స్‌మెన్‌కు వదిలేశారు. దీంతో రసవత్తరంగా సాగుతున్న టెస్టులో కుర్రాళ్లు గె(ని)లుస్తారా! అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు తొలిసారి తమ పూర్తిస్థాయి ప్రతిభను ప్రదర్శించారు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో ధోని ఏం చెప్పాడోగానీ అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. 105 పరుగులకు ఆలౌట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పి బ్యాట్స్‌మెన్‌పై భారం వేశారు.
దీంతో ఈడెన్‌పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. విజయ్ (13) విఫలమైనా.... శిఖర్ ధావన్ (70 బంతుల్లో 49 బ్యాటింగ్; 5 ఫోర్లు), పుజారా (61 బంతుల్లో 22 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్సర్) నిలకడగా ఆడుతున్నారు.
అంతకుముందు 130/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్‌కు 301 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ (120 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా (44 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. రాస్ టేలర్ (73 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
ఊ 72 పరుగులకు 6 వికెట్లు
షెడ్యూల్ కంటే మ్యాచ్ అరగంట ముందుగా ప్రారంభం కావడంతో పిచ్‌పై ఉండే తేమను కివీస్ బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న రహానే (26), రోహిత్‌లను ఆరు బంతుల వ్యవధిలో అవుట్ చేశారు. సౌతీ బంతిని ఆడబోయి తొలి స్లిప్‌లో రహానే క్యాచ్ ఇవ్వగా, రోహిత్ ఓ పేలవమైన షాట్‌కు వెనుదిరిగాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోని (10) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే రెండో ఎండ్‌లో జడేజా మాత్రం మొండిగా పోరాడుతూ... జహీర్ (14)తో కలిసి ఫాలో ఆన్ మార్క్‌ను దాటించాడు. చివర్లో ఇషాంత్ (0), షమీ (2) వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓవరాల్‌గా భారత్ 72 పరుగులకు చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. వాగ్నేర్ 4, బౌల్ట్, సౌతీ చెరో మూడు వికెట్లు తీశారు.
ఊ స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 0; విజయ్ (బి) వాగ్నేర్ 26; పుజారా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; కోహ్లి (సి) ఫుల్టన్ (బి) సౌతీ 4; రోహిత్ (బి) బౌల్ట్ 72; రహానే (సి) టేలర్ (బి) సౌతీ 26; ధోని (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 10; జడేజా నాటౌట్ 30; జహీర్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 14; ఇషాంత్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 0; షమీ (సి) ఫుల్టన్ (బి) వాగ్నేర్ 2; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (60 ఓవర్లలో ఆలౌట్) 202.
వికెట్ల పతనం: 1-1; 2-3; 3-10; 4-51; 5-138; 6-138; 7-167; 8-188; 9-189; 10-202
బౌలింగ్: బౌల్ట్ 17-2-38-3; సౌతీ 19-6-38-3; అండర్సన్ 5-0-29-0; వాగ్నేర్ 11-0-64-4; సోధి 6-0-13-0; విలియమ్సన్ 2-0-9-0.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ (సి) జడేజా (బి) షమీ 5; రూథర్‌ఫోర్డ్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 0; విలియమ్సన్ (సి) జడేజా (బి) జహీర్ 3; టేలర్ (సి) రహానే (బి) జహీర్ 41; బి.మెకల్లమ్ రనౌట్ 1; అండర్సన్ (బి) షమీ 2; వాట్లింగ్ (బి) ఇషాంత్ 11; సౌతీ (సి) పుజారా (బి) జడేజా 14; సోధి (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0; వాగ్నేర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 14; బౌల్ట్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (41.2 ఓవర్లలో ఆలౌట్) 105.
వికెట్ల పతనం: 1-1; 2-9; 3-11; 4-15; 5-25; 6-63; 7-78; 8-78; 9-80; 10-105
బౌలింగ్: షమీ 12-1-37-3; జహీర్ 9-2-23-2; ఇషాంత్ 10.2-3-28-3; జడేజా 9-4-10-1; రోహిత్ 1-0-3-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 13; ధావన్ బ్యాటింగ్ 49; పుజారా బ్యాటింగ్ 22; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 87.
వికెట్ల పతనం: 1-36; బౌలింగ్: బౌల్ట్ 6-0-28-0; సౌతీ 5-0-18-1; వాగ్నేర్ 6-2-11-0; అండర్సన్ 3-0-8-0; సోధి 4-1-17-0; విలియమ్సన్ 1-0-5-0.
ఊ కుప్పకూలిన కివీస్
తన తొలి రెండు ఓవర్లలో రూథర్‌ఫోర్డ్ (0), ఫుల్టన్ (5)లను అవుట్ చేసిన షమీ కివీస్‌కు షాకిచ్చాడు. అయితే టేలర్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినా... రెండో ఎండ్‌లో విలియమ్సన్‌ను జహీర్ కట్టడి చేశాడు. లంచ్‌కు ముందు జడేజా అద్భుతమైన త్రోకు మెకల్లమ్ రనౌట్ అయ్యాడు. లంచ్ తర్వాత షమీ... అండర్సన్ (2)ను వెనక్కిపంపాడు. దీంతో 25 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరడంతో టేలర్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో సౌతీ (14), వాగ్నేర్ (14) కాపాడే ప్రయత్నం చేసినా భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు తలవంచారు.