![Shimron Hetmyer Could Be The Hottest Property in Upcoming IPL - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/26/Shimron-Hetmyer.jpg.webp?itok=kySkkY7f)
హెట్‌మైర్
హైదరాబాద్ : వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ ఐపీఎల్-2019 సీజన్‌కు హాట్ కేక్ కానున్నాడా? అంటే అవుననే అంటున్నారు.. క్రికెట్ విశ్లేషకులు. తాజాగా భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ 21 ఏళ్ల కరేబియన్ ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. గువాహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి తమ జట్టు భారీ స్కోర్ చేసేలా చేశాడు. ఇక రెండో వన్డే వైజాగ్‌లో దాదాపు భారత్‌ను ఓడించినంత పనిచేశాడు. తనదైన బ్యాటింగ్‌తో 7 సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అనవసర షాట్‌కు ప్రయత్నించి హెట్‌మైర్ శతకం వృథా చేసుకున్నాడు.. కానీ అతని సెంచరీ అయ్యుంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా ఓడిపోయిది.
మిలియన్ డాలర్ బేబీ..
హెట్‌మైర్ ఈ తరహా ప్రదర్శనకు భారత మాజీ, సీనియర్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో అతను ఐపీఎల్-2019 సీజన్‌కు హాట్‌కేకని.. భారీ ధరనే పలకబోతున్నాడని అంచనా వేస్తున్నారు. ఇక భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అయితే వచ్చే సీజన్‌కు హెట్‌మైర్ మిలియన్ డాలర్ బేబీ అని పేర్కొన్నాడు. హెట్‌మైర్ కోసం ముఖ్యంగా మూడు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయని క్రీడా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
గత సీజన్ ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ హెట్‌మైర్ కోసం పోటిపడనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరంతో బాధ్యతలు చేపట్టిన కన్నె విలియమ్సన్ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపైనే మోసిన విలియమ్సన్‌కు మిడిలార్డర్ నుంచి సహాకారం దూరమైంది. దీంతో ఆ జట్టు ఫైనల్‌కు చేరిన టైటిల్ కొట్టలేక పోయింది. వచ్చే సీజన్‌లో వార్నర్ పునరాగమనంతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ పరిస్థితుల్లో హెట్‌మైర్‌తో మిడిలార్డర్‌ను పటిష్టం చేయాలని ఆ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక ఆ జట్టు ప్రధాన కోచ్ టామ్ మూడీకి కరేబియన్ ప్రీమియర్ లీగ్‌తో సంబంధం ఉండటం.. హెట్‌మైర్‌పై పూర్తి అవగాహన ఉండటం కూడా కలిసొచ్చె అంశం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం హెట్‌మైర్ కోసం పోటీ పడనుంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్లు ఈ జట్టు పరిస్థితి. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లి, డివిలియర్స్ ఉన్నప్పటికి ఆ జట్టు ఇప్పటి వరకు టైటిల్ కొట్టలేకపోయింది. 2019 సీజన్‌లో టైటిల్ లక్ష్యంగా భావిస్తున్న ఆర్సీబీ ఇప్పటికే ఆదిశగా కసరత్తులు మొదలు పెట్టింది. గ్యారీ కిరిస్టెన్‌కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పజెప్పింది. అలాగే ఆటగాళ్ల మార్పుపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తన హిట్టింగ్‌తో ఆకట్టుకున్న హెట్‌మైర్‌ను తీసుకోవాలని యోచిస్తోంది. గత సీజన్‌లో యువమంత్రం జపించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సైతం హెట్‌మైర్ కోసం పోటీపడనుంది. ఇప్పటికే ఆ జట్టులో పృథ్వీ షా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు టాపార్డర్‌లో నిలకడగా రాణిస్తున్నారు. అయితే ఆ జట్టుకు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చే బ్యాట్స్‌మన్ లేరు. దీంతో ఆ స్థానాన్ని హెట్‌మైర్‌తో భర్తీ చేయాలని భావిస్తోంది. తన ప్రదర్శనతో అందిరి దృష్టిలో పడ్డ హెట్‌మైర్ ఎవరి సొంతం అవుతాడో.. ఎంత పలుకుతాడో తెలియాలంటే వచ్చే సీజన్ వేలం వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment