'నన్ను, యువరాజ్ను అక్తర్ కొట్టాడు'
న్యూఢిల్లీ: దాదాపు పది సంవత్సరాల క్రితం పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్కు తనకు మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవల బయటపెట్టాడు. 2004లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా అక్తర్ తనను చాలా సార్లు తిట్టడమే కాకుండా, ఒకసారి కొట్టినట్లు కూడా హర్భజన్ స్పష్టం చేశాడు.అప్పుడు మరో భారత క్రికెటర్ యువరాజ్ను కూడా అక్తర్ కొట్టినట్లు ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ వెటరన్ పేర్కొన్నాడు.
' షోయబ్ చాలాసార్లు నన్ను తిట్టాడు. అక్తర్ ఎప్పుడూ మా పక్కనే కూర్చునేవాడు. నాకు, యువరాజ్కు అక్తర్ చాలా దగ్గరగా ఉండేవాడు. మేము ఏమి మాట్లాడతామో అనే ఉద్దేశంతోనే అక్తర్ అలా చేసేవాడు అనుకుంటా. ఒకానొక సందర్భంలో నా గదికి వచ్చి నన్ను కొడతానని అక్తర్ భయపెట్టాడు. నేను కూడా అక్తర్ హెచ్చరికను ఆహ్వానించా. ఎవరు ఎవర్ని కొడతారో చూసుకుందా అని నేను కూడా అక్తర్కు దీటుగా బదులిచ్చా. ఒకసారి అన్నట్టుగానే నా గదికి వచ్చి నాతో పాటు యువీని కూడా కొట్టాడు. అక్తర్ భారీ మనిషి కావడం వల్ల అతన్ని పట్టుకోవడం మావల్ల కాలేదు' హర్భజన్ తెలిపాడు.
అయితే దీనిపై అక్తర్ స్పందిస్తూ.. రావల్పిండిలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఇది జరిగినట్లు పేర్కొన్నాడు.అయితే ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏదో సరదా కోసం చేశానని అక్తర్ అన్నాడు. ఆ సమయంలో యువరాజ్, హర్భజన్లు యువ క్రికెటర్లు అని, వారిని ఎప్పుడూ తాను సోదర భావంతో చూసినట్లు పేర్కొన్నాడు.