
భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తానికి ఆసక్తి. దాయాది దేశాల జట్లు నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీ తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటారు క్రికెట్ ప్రేమికులు.
ఇక ఇరుదేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆసియా కప్(Asia Cup), ఐసీసీ మేజర్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్- పాకిస్తాన్ ముఖాముఖి పోటీపడుతున్నాయి. ఇందులోనూ ఎక్కువ సందర్భాల్లో టీమిండియానే చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.
స్నేహంగా మెలుగుతున్న ఆటగాళ్లు
2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న పాకిస్తాన్ కూడా వరుస విజయాలపై కన్నేసింది.
అయితే, ఆటలో ప్రత్యర్థులే అయినా.. మైదానం వెలుపల మాత్రం ఇరు దేశాల ఆటగాళ్లు స్నేహభావంతోనే మెలుగుతున్నారు. నిన్నటితరం ఆటగాళ్లు హర్భజన్ సింగ్- షోయబ్ అక్తర్ చిన్నపిల్లల్లా మైదానంలోకి పరుగులు తీస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ కావడం ఇందుకు నిదర్శనం.
వారితో స్నేహం వద్దు
అయితే, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ మాత్రం భారత్- పాక్ క్రికెటర్లను ఉద్దేశించి విచిత్ర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో ఎక్కువగా స్నేహంగా మెలగవద్దని సూచించాడు. ప్రత్యర్థి జట్టుతో ఫ్రెండ్‌షిప్ చేస్తే దానిని వాళ్లు అడ్వాంటేజ్‌గా మలచుకుంటారని అభిప్రాయపడ్డాడు.
నాకైతే అర్థం కావడం లేదు
‘‘అసలు ఇటీవలి కాలంలో పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ సమయంలో మన ఆటగాళ్లు ప్రవర్తిస్తున్న తీరు నాకు చిత్రంగా అనిపిస్తోంది. భారత బ్యాటర్లు క్రీజులోకి రాగానే మనవాళ్లు వెళ్లి.. వారి బ్యాట్‌ను పరిశీలించడం, వాళ్ల వెన్నుతట్టడం, స్నేహంగా మాట్లాడటం.. ఇదంతా ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.
మాట్లాడాల్సిన అవసరమే లేదు
మైదానం లోపల, వెలుపల ప్రొఫెషనల్‌గా ఉండాలి. వాళ్లతో అంత స్నేహంగా మెలగాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు అయినా.. కొన్ని హద్దులు ఉంటాయి. అసలు మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదని మా సీనియర్లు చెప్పేవారు.
ఎందుకంటే.. ప్రత్యర్థి జట్టుతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే.. అది మన బలహీనతకు సంకేతంలా కనిపిస్తుంది’’ అని ఉష్నా షా పాడ్‌కాస్ట్‌లో మొయిన్ ఖాన్ చిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం ఈ టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో చివరిగా మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది.
చదవండి: T20 WC 2025: ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిందిలా!
Comments
Please login to add a commentAdd a comment