CT 2025: ఆసీస్‌ కాదు!.. సెమీస్‌ చేరే జట్లు ఇవే: షోయబ్‌ అక్తర్‌ | Shoaib Akhtar Predicts Semi Final Teams For Champions Trophy 2025 Semis, Says Pakistan Will Beat India, More Details | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: ఆసీస్‌ కాదు!.. సెమీస్‌ చేరే జట్లు ఇవే: షోయబ్‌ అక్తర్‌

Published Sat, Feb 8 2025 11:21 AM | Last Updated on Sat, Feb 8 2025 12:25 PM

India Pakistan And: Shoaib Akhtar Does Not Name Australia In CT 2025 Semis

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌(Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఈసారి మూడు ఆసియా దేశాలు సెమీ ఫైనల్‌ చేరతాయని అంచనా వేశాడు. అదే విధంగా.. మరోసారి 2017 నాటి ఫైనలిస్టులే టైటిల్‌ కోసం హోరాహోరీ తలపడటం ఖాయమని జోస్యం చెప్పాడు.

కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌- దుబాయ్‌ వేదికలుగా చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక వన్డే టోర్నమెంట్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌(Dubai)లోనే ఆడనుంది. 

రెండు గ్రూపులు
ఇక ఈ మెగా ఈవెంట్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో పాకిస్తాన్‌ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్‌-2023లో సత్తా చాటిన ఆస్ట్రేలియా, భారత్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ తమ ప్రదర్శన ఆధారంగా బెర్తులు ఖరారు చేసుకున్నాయి.

ఆసీస్‌ లేదు.. మూడు ఆసియా దేశాలు
ఇక ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-‘ఎ’లో దాయాదులు భారత్‌, పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ ఉండగా.. గ్రూప్‌-‘బి’లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌పాకిస్తాన్‌తో మాట్లాడిన పాక్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌.. సెమీస్‌ చేరే మూడు జట్లను అంచనా వేశాడు.

‘‘చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌, ఇండియాతో పాటు అఫ్గనిస్తాన్‌ ఈసారి టాప్-4కు చేరుతుంది’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. అయితే, నాలుగో జట్టుగా వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత ఆస్ట్రేలియా ఉంటుందన్న మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయాల నడుమ అక్తర్‌ మాత్రం ఆ పేరును విస్మరించి.. కేవలం మూడు పేర్లే చెప్పడం గమనార్హం.

ఈసారి పాక్‌దే పైచేయి
ఇక ఈసారి భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో తమ జట్టే పైచేయి సాధిస్తుందని షోయబ్‌ అక్తర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ టీమిండియాను ఓడిస్తుందని ఆశిస్తున్నాను. ఈ రెండూ ఈసారి కూడా ఫైనల్‌ చేరతాయి’’అని జోస్యం చెప్పాడు. కాగా 2017లో ఆఖరిసారిగా చాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించగా.. నాడు టైటిల్‌ కోసం భారత్‌- పాకిస్తాన్‌ తలపడ్డాయి.

అఫ్గనిస్తాన్‌ జట్టు ఫేవరెట్‌.. ఎందుకంటే
అయితే, ఆ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి పాక్‌ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. అక్తర్‌ చెప్పినట్లు ఈసారి అఫ్గనిస్తాన్‌ జట్టు సెమీస్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఉందనడంలో సందేహం లేదు. భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023లో తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన అఫ్గన్‌.. లీగ్‌ దశలో ఆస్ట్రేలియాకు కూడా గట్టిపోటీనిచ్చింది.

తృటిలో సెమీస్‌ అవకాశాలకు చేజార్చుకుని ఆరోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌-2024లోనూ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గనిస్తాన్‌.. ఏకంగా సెమీ ఫైనల్‌ చేరి ఆశ్చర్యపరిచింది. 

ఇక ఈ రెండు టోర్నీల్లోనూ కనీసం టాప్‌-4లో అడుగుపెట్టలేకపోయిన పాకిస్తాన్‌.. చాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం ఫేవరెట్‌గానే ఉంది. మహ్మద్‌ రిజ్వాన్‌ సారథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డ మీద పాకిస్తాన్‌ రికార్డు విజయాలతో వన్డే సిరీస్‌లను గెలుచుకోవడమే ఇందుకు కారణం.

ఇక చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొడుతుంది. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో లీగ్‌ దశను ముగిస్తుంది.

చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement