
సెమీస్‌లో సింధు
డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
సాయిప్రణీత్, ప్రణయ్ ఓటమి మకావు ఓపెన్ టోర్నీ
మకావు: డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 21-13, 18-21, 21-14తో చెన్ యుఫీ (చైనా)పై విజయం సాధించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0-1తో వెనుకబడి ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 16-21, 23-21, 13-21తో గో సూన్ హువాట్ (మలేసియా) చేతిలో; ప్రణయ్ 21-18, 19-21, 11-21తో ఐసాన్ మౌలానా ముస్తఫా (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశారు.