విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్ష
హైదరాబాద్: ఫిలింనగర్ దైవసన్నిధానం సాక్షిగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకంతో తిరిగి రావాలని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్షించారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన పీవీ సింధును ఆదివారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆయన ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింధు కేవలం రజత పతకంతో సరిపెట్టుకోవద్దని బంగారు పతకం సాధించి ప్రపంచం గర్విం చదగ్గ క్రీడాకారిణిగా ఎదగాలన్నారు.
రియో ఒలింపిక్స్ ముందు దైవసన్నిధానంలో సింధుకు పతకం రావాలని కోరుకుంటూ కుంభాభిషేకం చేయడం జరిగిందని, దేవుడు అనుగ్రహించాడని తెలిపారు. కేవలం దైవభక్తి ఉంటే సరిపోదని గురుభక్తి కూడా కావాలని... గోపీచంద్ గురువుగా సింధు ఆయన మార్గంలో నడిచి ఈ పతకాన్ని సాధించిందన్నారు. గోపీచంద్‌తో తనకు ఐదేళ్ల అనుబంధం ఉందని చెప్పారు. సింధుకు పతకం రావడానికి గోపీచంద్ ఎంత కారణమో తన వద్దకు చాముండేశ్వరీనాథ్ ఆమెను తీసుకొచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, చాముండేశ్వరీనాథ్, మ్యాట్రిక్స్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.