నీళ్లు తాగుతూ గోల్ వదిలేశాడు
ఫుట్బాల్ మ్యాచ్లో ప్రతీ క్షణం కీలకమైనది. గోల్ కీపర్ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదు. అలాంటిది ఆట మధ్యలో గోల్ కీపర్ ఏకంగా నెట్ను విడిచి పక్కన నించుని తాపీగా నీళ్లు తాగుతున్నాడు. ఇంకేముంది ప్రత్యర్థి జట్టు మిడ్ఫీల్డర్ బంతిని నేరుగా గోల్పోస్టులోకి పంపాడు. గోల్ కీపర్ దాహార్తికి మ్యాచ్ విజయావకాశాలను చేజార్చుకున్నారు. చైనా సూపర్ లీగ్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. గోల్ కీపర్ కు 5 లక్షల రూపాయల జరిమానా విధించి సస్పెండ్ చేశారు.
చోంగ్గింగ్ లిఫాన్, లియోనింగ్ జట్ల ఫుట్బాల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ మరో 7 నిమిషాలకు మ్యాచ్ ముగుస్తుందనగా, లిఫాన్ 1-0 ఆధిక్యంలో ఉంది. కాసేపు ప్రత్యర్థి జట్టును నిలువరించి ఉంటే విజయం వరించేదే. కాగా ఆ సమయంలో లియోనింగ్కు ఫ్రీ కిక్ అవకాశం వచ్చింది. లియోనింగ్ మిడ్ఫీల్డర్ డింగ్ హైఫెంగ్ బంతిని గోల్ పోస్టు వైపు పంపాడు. అప్పుడు ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. లిఫాన్ గోల్ కీపర్ సూ వీజీ దాహం తట్టుకోలేక నెట్స్ పక్కన నీళ్లు తాగుతున్నాడు. దీంతో బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపో్యాడు. బంతి నేరుగా నెట్స్లోకి వెళ్లడం, అక్కడ గోల్ కీపర్ లేకపోయేసరికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యపోగా, లిఫాన్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. మ్యాచ్ 1-1తో సమమైంది. గోల్ కీపర్ చేసిన తప్పిదానికి లిఫాన్ విజయావకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. గోల్ కీపర్ నిర్లక్ష్యాన్ని జట్టు యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సూ వీజీకి 5 లక్షల రూపాయల జరిమానా విధించి సస్పెండ్ చేశారు. ఘోరమైన తప్పిదాన్ని చేశానని, ఇలాంటి తప్పును ఇకమీదట చేయబోనని, ఆట మధ్యలో ఏకాగ్రత కోల్పోనని సూ వీజీ చెంపలేసుకున్నాడు.