
హరారే: వరుసగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరాజయం తర్వాత ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు గెలుపు దక్కింది. పేస్ బౌలర్ స్టాన్‌లేక్ (4/8) అద్భుత బౌలింగ్ ప్రదర్శనకు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో ముక్కోణపు టి20 టోర్నీలో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టాన్‌లేక్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. షాదాబ్ ఖాన్ (29) టాప్ స్కోరర్.
నాలుగు ఓవర్ల స్పెల్ (4–0–8–4)లో ఓవర్‌కు ఓ వికెట్ చొప్పున పడగొట్టిన స్టాన్‌లేక్ పాక్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఛేదనలో కెప్టెన్ అరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్ 10.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.