
స్మృతి మంధాన
ముంబై: ఫైనల్ చేరే అవకాశాలు చేజారిన తర్వాత భారత మహిళల జట్టు మెరిసింది. ముక్కోణపు టి20 టోర్నీని విజయంతో ముగించింది. గురువారం నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం 8 వికెట్లతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ఈ సిరీస్‌లో మూడో అర్ధ శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత స్పిన్నర్ల విజృంభణతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. వ్యాట్ (31; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనూజ పాటిల్ 3, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం బరిలో దిగిన భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలుపొందింది. మిథాలీ రాజ్ (6), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20 నాటౌట్)తో కలిసి స్మృతి మంధాన జట్టును గెలిపించింది. వీరిద్దరు అభేద్యమైన మూడో వికెట్‌కు 60 పరుగులు జత చేయడంతో మరో 26 బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫైనల్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment