![India womens team to play first ODI against West Indies womens team](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/22/wmn.jpg.webp?itok=Wd4fgBWf)
వెస్టిండీస్ మహిళలతో సిరీస్‌లో నేడు తొలి వన్డే
మ.గం.1.30 నుంచి స్పోర్ట్స్–18లో ప్రసారం
వడోదర: కరీబియన్ జట్టుపై వరుసగా మరో సిరీస్ నెగ్గేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే జరుగుతుంది. ముంబైలో జరిగిన టి20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెపె్టన్, కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకపోయినా స్మృతి మంధాన నేతృత్వంలో జట్టు విజేతగా నిలిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారడం జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే మోకాలు గాయంతో సతమతమవుతున్న హర్మన్ ప్రీత్ ఫిట్‌నెస్ జట్టును కాస్త కలవరపెడుతోంది.
50 ఓవర్ల మ్యాచ్‌ల్లో మిడిలార్డర్ పాత్ర చాలా కీలకం. కాబట్టి ఆమె అందుబాటులోకి వస్తే జట్టుకు లాభిస్తుంది. 2017లో ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత మహిళల జట్టు 4–1తో వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. అయితే అప్పటికీ ఇప్పటికి చాలా మారింది. ప్రస్తుత జట్ల బలాబలాల విషయానికొస్తే... సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్‌లో భారత్ జట్టు గర్జించింది. వన్డే ఫార్మాట్‌లోనూ ఇదే జోరు కనబరిచేందుకు తహతహలాడుతోంది.
స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి వరుస మూడు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలతో అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ నిలకడగా రాణిస్తుండగా, హిట్టర్ రిచా ఘోష్ ఆఖరి టి20లో మెరుపు ఫిఫ్టీతో విండీస్ బౌలర్ల భరతం పట్టింది. ఈ త్రయం ఫామ్ ఇలాగే కొనసాగితే భారత్‌కు ఏ బెంగా ఉండదు. మిడిలార్డర్‌లో తేజల్ హసబి్నస్, హర్లిన్ డియోల్ జట్టును నడిపించగలరు. బౌలింగ్‌లో దీప్తిశర్మ, రేణుక సింగ్, సైమా ఠాకూర్‌లు ప్రభావం చూపిస్తున్నారు.
యువ పేసర్ టైటస్ సాధు ఫీల్డింగ్‌లో కనిపించే చురుకుదనం ప్రత్యర్థి పరుగుల్ని నిరోధిస్తోంది. మరోవైపు ప్రత్యర్థి వెస్టిండీస్ దెబ్బతిన్న పులిలా ఉంది. టి20ల్లో కోల్పోయిన సిరీస్‌ను వన్డేల్లో రాబట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కెపె్టన్ హేలీ మాథ్యూస్ వెటరన్ బ్యాటర్స్ డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ నిలకడగా ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో హెన్రీ, ఫ్లెచర్, కరిష్మా రమ్హారక్, జైదా జేమ్స్ ప్రభావం చూపగలరు.
తుది జట్లు (అంచనా)
భారత్ మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ఉమా ఛెత్రి, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, హర్లిన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రేణుక, సైమా ఠాకూర్, మిన్ను మణి.
వెస్టిండీస్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), క్వియానా జోసెఫ్, డియాండ్రా, షెమైన్ క్యాంప్‌బెల్, నెరిసా క్రాఫ్టన్, హెన్రీ, ఆలియా అలిన్, అఫీ ఫ్లెచర్, షబిక, జైదా జేమ్స్, కరిష్మా.
Comments
Please login to add a commentAdd a comment